షార్ట్ ఫిల్మ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

షార్ట్ ఫిల్మ్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలి

-లింగమర్మం షార్ట్ ఫిలింను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించాలి

– గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ

ప్రశ్న ఆయుధం న్యూస్, సెప్టెంబర్ 13, కామారెడ్డి :

లింగపూజ వద్దు.. బైబిల్ ముద్దు… అంటూ తీసిన లింగమర్మం షార్ట్ ఫిలింను యూట్యూబ్ నుంచి తక్షణమే తొలగించి షార్ట్ ఫిల్మ్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని గుడిమెట్ పీఠాధిపతి మహాదేవ్ స్వామీజీ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో స్వామీజీ మాట్లాడుతూ.. బ్రహ్మ, విష్ణు మధ్యలో ఉద్బవించిన లింగమే శివుని స్వరూపంగా పూజింపబడుతుందన్నారు. మూడేళ్ళ క్రితం తీసిన లింగమర్మం అనే షార్ట్ ఫిలింలో శివున్ని అవమానించే రీతిలో సన్నివేశాలు ఉన్నాయన్నారు. శివుని స్వరూపంగా పూజింపబడుతున్న శివలింగాన్ని అవమానించడం సరికాదన్నారు. తమ దేవున్ని తాము పూజించడం తప్పు అని చెప్పే హక్కు ఎవరికి లేదని తెలిపారు. లింగమర్మం అనే షార్ట్ ఫిల్మ్ మూడేళ్ళ క్రితం తీసినా ఇటీవల వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ శివ భక్తులను, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తుందన్నారు. బైబిల్ లో పనికిరాని విషయాలు ఎన్ని ఉన్నాయో తమకు తెలుసని, వాటిని తాము పట్టించుకోవడం లేదన్నారు. ఇతర మతాలను ప్రచారం చేసుకోవడం తప్పు కాదని, వారి మతం గొప్పదని చెప్పడానికి ఇతరులను కించపరిచేలా మాట్లాడటం, షార్ట్ ఫిలిమ్స్ తీయడం సరికాదన్నారు. ఇటీవల హిందు దేవుళ్లను అవమానించడం పరిపాటిగా మారిందని వీటిని తక్షణమే నిరోదించడానికి యావత్ హిందు బంధువులంతా ఏకమై ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లో ఏర్పాటైన పిరమిడ్ ధ్యాన మందిరం ప్రకటించిన 18 సూత్రాలను తక్షణమే తొలగించాలని మహాదేవ్ స్వామీజీ డిమాండ్ చేశారు. ధ్యాన కేంద్రం ఏర్పాటయ్యే సమయంలో హిందు దేవుళ్ళ గొప్పదనాన్ని చెప్పి భక్తులను చేరువ చేసుకుని ఇప్పుడు బొట్టు పెట్టుకోవద్దని , ప్రాణాయామం, యోగాసనాలు వద్దని, విగ్రహారాధన వద్దు అంటూ 18 సూత్రాలను ప్రకటించడం సరికాదన్నారు. ధ్యానం చేయడం తప్పు కాదని, ఇలాంటి సూత్రాల ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తాయని వెంటనే సూత్రాలను తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ భక్తులు రామేశ్వర్, ఆదిత్య, వినోద్, మల్లికార్జున్, కార్తీక్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now