సి.ఎం.ఆర్. డెలివరీ ఆలస్యం చేస్తే మిల్లర్లపై చర్యలు – కలెక్టర్ హెచ్చరిక
సెప్టెంబర్ 12లోపు సి.ఎం.ఆర్. డెలివరీ పూర్తి చేయాలని ఆదేశం
బ్యాంక్ గ్యారెంటీలు వారంలోగా సమర్పించాలన్న కలెక్టర్
ప్రతి రోజు క్రమం తప్పకుండా మిల్లింగ్ జరగాలని సూచన
గడువులోగా 100% సి.ఎం.ఆర్. డెలివరీ చేయాలని ఆదేశం
ప్రశ్న ఆయుధం ఆగష్టు 22కామారెడ్డి:
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మిల్లర్లను గట్టిగా హెచ్చరించారు. సి.ఎం.ఆర్. డెలివరీని త్వరితగతిన పూర్తి చేయాలని, లేదంటే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గడువును సెప్టెంబర్ 12, 2025 వరకు నిర్ణయించిందని గుర్తు చేశారు. మిల్లర్లు నిర్ణీత సమయానికి మిల్లింగ్ పూర్తి చేసి, 100 శాతం సి.ఎం.ఆర్. డెలివరీ చేయాలని ఆయన ఆదేశించారు. ఆలస్యం చేసిన మిల్లులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
అదేవిధంగా, మిల్లర్లు వారంలోగా బ్యాంక్ గ్యారెంటీలు జిల్లా కార్యాలయంలో సమర్పించాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. అధికారులు సకాలంలో సి.ఎం.ఆర్. అందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, డీసీఎస్ఓ మల్లిఖార్జున బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, రైస్ మిల్లర్ల సంఘ ప్రతినిధులు, జిల్లాలోని బాయిల్డ్ & రా రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.