వ్యాయామ ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశాలు ఇస్తాం
* జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ స్వాతి రెడ్డి
* గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్
* పత్రికా కథనాలతో స్పందించినట్లు వెల్లడి
*కొండపాక, జనవరి 09,
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించి, విచక్షణారహితంగా కొట్టిన వ్యాయామ ఉపాధ్యాయుడు వాసుపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ జస్టిస్ స్వాతి రెడ్డి అన్నారు. గురువారము దుద్దెడ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆమె సందర్శించి విద్యార్థులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అంతకుముందు బుధవారం చోటు చేసుకున్న పరిణామాలపై ఆరా తీశారు. విద్యార్థులతో విడివిడిగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని స్టోర్ రూము, కిచెన్ షెడ్డు, మరుగుదొడ్లను ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గురుకుల పాఠశాల విద్యార్థులకు జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి పాఠశాలను సందర్శించినట్లు తెలిపారు. విద్యార్థులను అనవసరంగా చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్ వాసుపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను తనిఖీ చేశారు.