సంగారెడ్డి ప్రతినిధి, జూన్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఇంటర్ విద్యలో విద్యార్థుల సంఖ్య పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఇంటర్ విద్య అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, డ్రాప్ అవుట్స్ తగ్గించాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నమోదును పెంచడానికి కార్యాచరణ చేయాలన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన పాఠశాల విద్యార్థుల సమాచారాన్ని డిఐఈఓ అధికారులు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ కు చేరవేయాలని అన్నారు. విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని సంగారెడ్డి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జూనియర్ కళాశాలల సిబ్బంది ద్వారా ప్రవేశాలను వేగవంతం చేయాలనీ పేర్కొన్నారు. బాల్య వివాహాల కారణంగా, పదకొండవ తరగతి నుండి పన్నెండో తరగతి వరకు చదువు మధ్యలో మానేయడం పెరుగుతోందనీ దాన్ని నిరోధించాలని అన్నారు. ప్రిన్సిపాల్స్ డ్రాప్ అవుట్ సర్వే నిర్వహించి కారణాలను సమర్పించవలసిందిగా ఆదేశించారు. మౌలిక సదుపాయాలు అవసరమయ్యే కళాశాలలలో జహీరాబాద్, బుధేరా, కల్హేర్, నారాయణఖేడ్, కోహీర్, జోగిపేట్, హద్నూర్, పుల్కల్, న్యాల్కల్, పటాన్చెరు, సంగారెడ్డి (బాలుర), సదాశివపేటలలో త్వరిత గతిన మౌలిక సదుపాయాలు కల్పించాలని పిలుపునిచ్చారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ నుండి ఎండీఎం పథకం ఖచ్చితంగా నమోదును మెరుగు పరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి గోవింద్ రావు, జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్ సంబందిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి: అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: June 11, 2025 6:37 pm
