సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): ఎన్నికలు ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా పని చేయాలని, ఆయా బృందాలు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులతో కలిసి ఎఫ్ ఎస్ టి, వివిఎస్ టి, విఎస్ టి, ఎస్ఎస్ టి, ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా పంచాయితీ ఎన్నికలు జరిగేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. ఆయా బృందాలు, అధికారులందరూ తమ తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ మాట్లాడుతూ.. వ్యయ నియంత్రణలో ఏఈఓల పాత్ర కీలకమైనదని అన్నారు. ఎన్నికల ప్రచార ఖర్చులు పకడ్బందీగా నమోదు చేయాలని, ఎన్నికలను ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఎఫ్ ఎస్ టి, వివి ఎస్ టి, విఎస్ టి, ఎస్ ఎస్టి.బృందాలు, ఏఈఓస్ నిర్వర్తించాల్సిన బాధ్యతలు, విధులను వివరించారు. ఎన్నికల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో జానకి రెడ్డి, డీపీవో సాయిబాబా, డీఆర్ డీఓ జ్యోతి, డీసీఓ, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలి: స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్
Published On: November 29, 2025 7:09 pm