Site icon PRASHNA AYUDHAM

చిన్న రోడ్డు సమస్యల పరిష్కారంతో ప్రమాదాలను నివారించవచ్చు: అదనపు కలెక్టర్ రాధికా గుప్తా

IMG 20250710 WA0091

*చిన్న రోడ్డు సమస్యల పరిష్కారంతో ప్రమాదాలను నివారించవచ్చు: అదనపు కలెక్టర్ రాధికా గుప్తా*

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 10:

చిన్న చిన్న రోడ్డు సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రమాదాలను నివారించడమే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ మరియు రోడ్డు భద్రత కమిటీ ఛైర్మన్ రాధికా గుప్తా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్న రహదారుల వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఆమె సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై అధికారులను ప్రశ్నించారు. అవసరమైతే విద్యుత్ స్తంభాలను మార్చి రహదారుల విస్తీర్ణాన్ని పెంచాలని, రోడ్ల ఇరువైపులా ఆక్రమణలను తొలగించాలని సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని, అవసరమైన చోట స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.

మున్సిపల్ కమిషనర్లు తమ వద్ద ఉన్న నిధులతో చిన్నపాటి మరమ్మత్తులను వెంటనే పూర్తి చేయాలని, వర్షపు నీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాధికా గుప్తా తెలిపారు. ఎక్కువ ప్యాచ్ వర్క్ చేయకుండా కొత్త రహదారులను నిర్మించాలని సూచించారు. భారీ నిర్మాణాలకు సంబంధిత శాఖల నుండి అనుమతులు తీసుకోవాలని చెప్పారు.

రోడ్డు ప్రమాదాల కేసుల్లో బాధితులకు పరిహారం ఇప్పటివరకు ఎవరెవరికి అందిందో, ఇంకా ఎంతమంది పెండింగ్‌లో ఉన్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని రహదారుల భద్రతను మెరుగుపరచాలని ఆమె సూచించారు.

ఈ సమావేశంలో జిల్లాలోని రోడ్లు మరియు భవనాల శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ అదనపు డీసీపీలు, ఏసీపీలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version