పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించాలి: అదనపు కలెక్టర్ రాధికా గుప్తా
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03
చిన్నారుల అభివృద్ధికి ఆటపాటలతో పాటు ఆటవస్తువుల ద్వారా విద్యనందించాలని, వారికి పరిశుభ్రమైన, పౌష్టికాహారం అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా సూచించారు. బుధవారం లాల్ గడి మలక్‌పేట్‌లోని హెచ్‌బీఎల్ భగీరథ్ బాలల వికాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
ఈ సందర్భంగా ఆమె అంగన్‌వాడీ సెంటర్‌లో విద్యార్థుల సంఖ్య, హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బడికి రాని పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో తీసుకురావాలని ఆదేశించారు. గర్భిణీ మహిళలకు గుడ్లు, పౌష్టికాహారం తప్పనిసరిగా అందించాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి, పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా ఇస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు.
పుట్టినరోజు ఉన్న విద్యార్థులకు బొమ్మలు, బహుమతులు అందజేశారు. అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ నిర్వహణ బాగుందని అభినందించారు.