గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ రాధికా గుప్తా
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను బుధవారం నాగారం మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పరిశీలించారు. రాబోయే మూడు రోజుల్లో జరగనున్న గణేష్ నిమజ్జనం కోసం ప్రజలకు సౌకర్యాలు, రహదారి రవాణా, భద్రతా చర్యలను సమగ్రంగా సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.
నిమజ్జన స్థలంలో ఏర్పాట్లు, భద్రతా కట్టడాలు, వాహనాల రాకపోకలు, లైటింగ్, నీటి లోతు వంటి అంశాలపై అధికారులు నివేదిక ఇవ్వగా, సంబంధిత శాఖలకు ఆమె తక్షణ సూచనలు జారీ చేశారు. “ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఎటువంటి అవాంతరాలు లేకుండా నిమజ్జనం పూర్తి చేసుకునేలా చూడాలి” అని ఆమె స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో మున్సిపాలిటీ కమిషనర్ ఎస్. భాస్కర్ రెడ్డి, ఆర్.ఓ బి. నాగేశ్వర్ రావు, డిప్యూటీ ఇంజనీర్ టి. సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.