సర్టిఫికెట్ జారీలో ఆలస్యం వద్దు – ఘట్కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 29
రెవెన్యూ సదస్సులు, భూభారతి సదస్సులలో అందిన దరఖాస్తులను నిబంధనలకు అనుగుణంగా, నిర్ణీత సమయానికి పరిష్కరించి సర్టిఫికెట్లు జారీ చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి ఆదేశించారు.
శుక్రవారం ఘట్కేసర్ మండలంలో పర్యటించిన ఆయన, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ –
కులం, స్థానికత, ఆదాయం తదితర సర్టిఫికెట్ల కోసం చేసిన దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా వెంటనే జారీ చేయాలి.
సర్టిఫికెట్ జారీలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
అవసరమైతే క్షేత్రస్థాయి పర్యవేక్షణ జరిపి అర్హులను గుర్తించి ధృవీకరణలు ఇవ్వాలి.
పరిపాలన సంబంధిత ఫైళ్లను కూడా పెండింగ్‌లో ఉంచకూడదు.
ఘట్కేసర్ మండల పరిధిలో ఇంకా పరిష్కారం కాని దరఖాస్తులను వెంటనే ప్రభుత్వానికి పంపి, నిబంధనల మేరకు పూర్తి చేయాలని ఆయన తహసీల్దార్‌కు సూచించారు. రెవెన్యూ రికార్డులు, రిజిస్టర్లను కూడా సమగ్రంగా పరిశీలించారు.
తరువాత ఘట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్తో కలిసి ఏదులాబాదు చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ తహసీల్దార్ రజని, డిటి రాజేందర్, సీనియర్ అసిస్టెంట్ ఆదిత్య, సర్వేయర్ రూపా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.