ప్రజావాణి దరఖాస్తుల త్వరిత పరిష్కారానికి అదనపు కలెక్టర్ ఆదేశం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 28:
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి ఆయన 80 దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. దరఖాస్తుల పరిశీలనలో ఎటువంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే, తిరస్కరించబడిన దరఖాస్తుల విషయంలో, తిరస్కరణకు గల కారణాలను అర్జీదారులకు తప్పనిసరిగా వివరంగా తెలియజేయాలని సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.