సీనియర్ జడ్జి వేధిస్తున్నారని ఆరోపిస్తూ రాజీనామా చేసిన మహిళా జడ్జి అదితి శర్మ..
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరుగురు మహిళా న్యాయమూర్తులను తొలగించడం తప్పు అని వారిని తిరిగి నియమించాలని సుప్రీంకోర్టు కొన్ని నెలల క్రితం ఆదేశించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఈ ఆరుగురు న్యాయమూర్తులలో ఒకరు అదితి శర్మ, ఆమె జూలై 28న తన పదవికి రాజీనామా చేశారు.
”నేను ఈ వ్యవస్థ చేతిలో ఓడిపోయినందుకు కాదు, ఈ వ్యవస్థే విఫలమైనందుకు జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేస్తున్నా” అని అదితి శర్మ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత 2025 మార్చిలో, అదితి శర్మ మళ్లీ మధ్యప్రదేశ్‌లోని శహ్‌డోల్ జిల్లాలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్)గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లో చేరి ఐదు నెలలు మాత్రమే అయింది.
”ఒకరికి అనుకూలంగా నిర్ణయం వచ్చినప్పటికీ, ఓడిపోయిన వ్యక్తి తన వాదనలు వినిపించి, సంతృప్తి చెందే అవకాశం కల్పించడానికి కోర్టులు అవసరం. నాకు న్యాయం జరగలేదు, విచారణ కూడా జరగలేదు” అని ఆమె అన్నారు.