*ప్రజావాణి కార్యక్రమంలో 70 దరఖాస్తుల స్వీకరణ*
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 9
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ఎటువంటి జాప్యం లేకుండా త్వరగా పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి డీఆర్ఓ హరిప్రియతో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ 70 దరఖాస్తులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, “ఎంతో వ్యయప్రయాసలకోర్చి, తమ సమస్యలు పరిష్కారమవుతాయనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారు. వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది,” అని అన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, వాటి పరిశీలనలో ఎలాంటి జాప్యం ఉండకూడదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా, తిరస్కరించే దరఖాస్తుల విషయంలో అర్జీదారులకు ఎందుకు తిరస్కరిస్తున్నారనే విషయాన్ని తప్పనిసరిగా వివరంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్‌లైన్‌లో వెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో లా ఆఫీసర్ చంద్రావతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.