ఆఫ్ఘానిస్తాన్ భూకంపం – మానవ అస్తిత్వానికి ముప్పు
ఇటీవల ఆఫ్ఘానిస్తాన్‌ను తాకిన భూకంపం ప్రపంచంలో ఇటీవల కాలంలో జరిగిన అతి ఘోరమైన విపత్తుగా పరిగణించబడుతోంది. మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని అంచనా. వేలాదిమంది గాయాలతో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. అంతర్జాతీయ సమాజం నుంచి కొంతమేర సహాయం అందుతున్నా, అది అత్యంత పరిమితంగానే ఉంది. ఈ విపత్తు కారణంగా మానవతావాద సహాయం అత్యవసరమైంది.
అయితే, ఈ రక్షణ చర్యల్లో ఒక కలవరపరిచే విషయం వెలుగులోకి వచ్చింది. పురుషులు, పిల్లల ప్రాణాలను రక్షించడంలో ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, మహిళలను రక్షించడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. కారణం ఏమిటంటే, ఆ సమాజంలోని కఠిన మతపరమైన సంప్రదాయ కట్టుబాట్ల అనుసారంగా మహిళలను ఇతర పురుషులు తాకకూడదు అన్న నియమం. రక్షకులు ఎక్కువగా పురుషులే కావడంతో వారు మహిళలకు సాయం చేయడంలో వెనుకడుగు వేస్తున్నారు. ఈ విధానం అనేక మంది మహిళల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతోంది.
మతపరమైన కట్టుబాట్లు ప్రాణ రక్షణ కంటే ముఖ్యమైపోతే, అది కేవలం ఆ దేశానికే కాదు,మానవ అస్తిత్వానికే ముప్పు. మానవజాతి యొక్క ప్రాథమిక విలువ “ప్రాణ రక్షణ” కావాలి. ఆ విలువను పక్కనబెట్టి, మూఢ విశ్వాసాలను, సంప్రదాయాలను కాపాడటానికి ప్రాణాలను త్యాగం చేయడం భయంకరమైన అమానవీయమైనది.
ఆఫ్ఘానిస్తాన్ ఎప్పటినుంచో మతాధిపత్యానికి పెట్టింది పేరు. మహిళల హక్కులు ఎప్పుడూ అక్కడ అప్రజాస్వామికంగా పరిమితమైపోయాయి. కానీ ఇటువంటి ఘోర విపత్తు సమయంలో కూడా అదే పరిస్థితి కొనసాగడం, అంతర్జాతీయ సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం. సహాయం చేయడానికి ముందుకు వచ్చే వారు కేవలం ఆహారం, మందులు ఇవ్వడం కాదు,వారి ప్రాణాలను రక్షించడానికి అడ్డుగా ఉన్న ఈ మతపరమైన అవరోధాలను కూడా ప్రశ్నించాలి.
విపత్తులు మానవాళిని ఏకం చేయాలి. కానీ ఒక వర్గాన్ని ప్రక్కన బెట్టే సంప్రదాయాలు మానవత్వాన్ని మట్టుబెడతాయి. చివరికి మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే!
*”మానవ ప్రాణం కంటే విలువైనది మరియు గొప్పది ఏ మతం, ఏ సంప్రదాయం కాదు. ప్రాణ రక్షణకే ప్రాధాన్యం ఇవ్వకపోతే, అది మానవ అస్తిత్వానికే ముప్పు”*.