కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం అబ్దుల్ నగర్ శివారులో తమ భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బాధితులైన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 70 ఏళ్లుగా భూమిపై హక్కు ఉందని, అన్ని ప్రభుత్వ అనుమతులు, పత్రాలు ఉన్నాయని రైతులు తెలిపారు.
అబ్దుల్ నగర్ శివారులోని సర్వే నెంబర్లు 89, 95, 106, 122లలోని భూములను గత 70 సంవత్సరాలుగా తాము సాగు చేసుకుంటున్నామని, 2026 వరకు కూడా ఆ భూముల్లో పంటలు పండించుకునే స్థితిలో ఉన్నామని రైతులు తెలిపారు.
1982లో కామారెడ్డి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా పట్టాలు పొందామని, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త పాసుబుక్కులు, రైతుబంధు పథకం లబ్ధి కూడా పొందుతున్నామని, పాత పాసుబుక్కులు కూడా ఆధారాలుగా ఉన్నాయని వివరించారు.
అయితే, కొందరు వ్యక్తులు తమ భూములపై హక్కులు చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ విషయంపై ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలకు నోటీసులు వచ్చినప్పుడు అవసరమైన అన్ని పత్రాలను సమర్పించామని రైతులు పేర్కొన్నారు.
తమ భూములపై పూర్తిస్థాయి విచారణ జరిపి, నిజానిజాలను నిర్ధారించి, తమకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవోలను బాధితులైన రైతులు కోరుతున్నారు.


