రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. లింగాపూర్ లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శుక్రవారం జిల్లాలోని లింగాపూర్ గ్రామంలో మేప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. కొనుగోలు కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, ఇప్పటివరకు జరిగిన ధాన్యం సేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తక్షణమే అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదనపు సిబ్బంది ఏర్పాటు ద్వారా రైతులకు నిరీక్షణ తగ్గుతుందని ఆయన తెలిపారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, త్వరితగతిన తూకాలు పూర్తి చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మేప్మా సంఘానికి లభించే కమిషన్ మొత్తాన్ని సభ్యులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా వినియోగించాలని, తద్వారా సంఘం ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు.
వర్షాకాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియను లక్ష్యానికి అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, ధాన్యం సేకరణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












