కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శిబిరంలో మొత్తం 20 గేదెలకు గర్భకోశ వ్యాధి చికిత్సలు అందించగా, 16 పశువులకు సాధారణ వైద్య సేవలు, 23 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి 35 మంది రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, పాడి రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని, పశువులకు సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. దూడల సంరక్షణ, పశుగ్రాసాల సాగులో శాస్త్రీయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.












