యాసంగి సీజన్ ముగిసి మొక్కజొన్న పంట చేతికొచ్చినా, ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంపై బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి నెహ్రూ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, దళారుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే తక్షణమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని దళారులు అవకాశంగా తీసుకుంటున్నారని, తమకు నచ్చిన తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ గిరిజన, గిరిజనేతర రైతులను మోసం చేస్తున్నారని నెహ్రూ నాయక్ ఆరోపించారు.
చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడరాని పాట్లు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, మార్కెట్ అధికారులు వెంటనే స్పందించి, మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులకు మద్దతు ధర కల్పించాలని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని ఆయన తెలియజేశారు.










