సంగారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సజావుగా, వేగవంతంగా నిర్వహించేందుకు రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కోరారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు చేరుతున్న ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, ఆలస్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మిల్లర్లు అవసరానికి అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేసుకోవాలని, ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా చూడాలని తెలిపారు.
రైతులు ధాన్యం విక్రయానికి వచ్చినప్పుడు నిరీక్షణ లేకుండా త్వరితగతిన ప్రక్రియ పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లర్లు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా, ఆయా సమస్యలను పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ టి.ఎల్. సంగీత, జిల్లా పౌర సరఫరాల అధికారి, సివిల్ సప్లై డీఎం, డిసిఓ, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.












