అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసే ప్రతి ధాన్యపు గింజకు హామీ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం జోగిపేట మార్కెట్ యార్డు, కొర్పోల్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీలు, లారీలు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్, మిల్లులకు తరలింపు, చెల్లింపుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన మేరకు హమాలీలు, లారీలు సమకూర్చాలని కలెక్టర్ సూచించారు. అకాల వర్షాల దృష్ట్యా, కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 233 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.












