రానున్న రోజుల్లో అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా కొనుగోలు ప్రక్రియను ఐదు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు సూచనలు జారీ అయ్యాయి.
జిల్లాలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాలతో పంటలు తడవకుండా కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక మహిళా సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులు వేగంగా అందేలా ట్యాబ్ ఎంట్రీలు, డేటా అప్డేషన్ను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, ఆదివారాల్లో కూడా చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలుతో పాటు రూ.45 వేల కోట్లకు పైగా చెల్లింపులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.












