సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజలకు శాంతియుత పరిష్కారం కల్పించడం లోక్ అదాలత్ లక్ష్యం అని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర అన్నారు. శనివారం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్ర శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నెల 15న జరగబోయే ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, సమన్వయ చర్యలు, కేసుల గుర్తింపు అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి–కమ్–చైర్‌పర్సన్ జి.భవాని చంద్ర అధ్యక్షత వహించగా, జిల్లా న్యాయ సేవాధికారి కార్యదర్శి బి. సౌజన్య, జిల్లా పోలీసు కార్యాలయ ప్రతినిధులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు, కోర్టు లైజన్ అధికారులు, న్యాయ సేవా అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవాని చంద్ర మాట్లాడుతూ.. లోక్ అదాలత్ ప్రజలకు వేగవంతమైన, తక్కువ వ్యయంతో మరియు సయోధ్య పద్ధతిలో న్యాయం అందించే వేదిక అని అన్నారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించడం, ప్రజలకు శాంతియుత పరిష్కారం కల్పించడం లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమని వివరించారు.ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో సయోధ్య సాధ్యమైన కేసులను ముందుగానే గుర్తించి వాటి జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, చిన్నపాటి వివాదాలు, కుటుంబ సంబంధిత మరియు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులను ప్రాధాన్యతగా గుర్తించాలని తెలిపారు. మహిళా, కుటుంబ లేదా సామాజిక వివాదాల విషయంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. పోలీసులు కోర్టు మరియు న్యాయ సేవాధికార సంస్థలతో సమన్వయం చేసుకుంటూ కేసు వివరాలు, పక్షాల సమాచారం, స్థితిని తక్షణం తెలియజేయాలని అన్నారు. ప్రజలకు లోక్ అదాలత్ ప్రయోజనాలు, సయోధ్య ద్వారా లభించే న్యాయం గురించి అవగాహన కల్పించడం పోలీసు శాఖ బాధ్యతగా పేర్కొన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ స్థాయిలో ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజలను లోక్ అదాలత్‌లో తమ కేసులు పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. పోలీసు శాఖ సహకారం లేకుండా లోక్ అదాలత్ విజయవంతం కాదని స్పష్టం చేశారు. అందువల్ల అన్ని స్థాయిలలో సమన్వయం, క్రమశిక్షణ, ప్రజా ప్రయోజనం దృష్ట్యా కృషి చేయాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న పోలీసు అధికారులు గరిష్టంగా సయోధ్య సాధ్యమైన కేసులను గుర్తించి లోక్ అదాలత్‌కు పంపించేందుకు, ప్రజా అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్‌లో సయోధ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలను కుంటే, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం, సంగారెడ్డి లేదా సంబంధిత కోర్టు న్యాయ సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చని భవానిచంద్ర సూచించారు.
ప్రజలకు శాంతియుత పరిష్కారం కల్పించడం లోక్ అదాలత్ లక్ష్యం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవానిచంద్ర
Published On: November 1, 2025 5:48 pm