Site icon PRASHNA AYUDHAM

పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..!!

IMG 20250314 224519

*పాఠశాలకు వెళ్లే విద్యార్థినిలే లక్ష్యం..*

*డ్రగ్స్ ఇచ్చి కామాంధులకు బేరం..*

వరంగల్: వరంగల్‌లో ఓ కిలేడీ అరాచకాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తున్నాయి. అమాయక ఆడపిల్లలే లక్ష్యంగా ఆమె చేసిన ఘోరాలు సినీ స్టోరీని తలపిస్తున్నాయి. మత్తుమందులకు అలవాటు పడి ముఠాగా ఏర్పడిన వారంతా చేసిన అకృత్యాలు పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తున్నాయి. వారు చేసిన దారుణాలు తెలుసుకుంటే ఆడపిల్లలను పాఠశాలలకు పంపాలంటేనే భయం వేస్తుంది.

హనుమకొండ జిల్లా దామెర మండలానికి చెందిన ఓ కిలాడీ లేడీ కొంతకాలంగా వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటోంది. డ్రగ్స్‌కు బానిసైన సదరు మహిళ తనతోపాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ముఠా ఏర్పడింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వారంతా పాఠశాల బాలికలే లక్ష్యంగా దారుణాలకు పాల్పడ్డారు. వరంగల్‍లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించే కిలేడీ స్కూళ్లకు వెళ్లే బాలికలతో పరిచయం పెంచుకునేది. అలా ఎంపిక చేసుకున్న బాలికలకు రోజూ మాటలు కలిపి తాను మంచిదాన్నని నమ్మించేది. బాగా పరిచయం ఏర్పడిన తర్వాత బయటకు వెళ్దామని చెప్పి కిడ్నాప్ చేసేది.

అనంతరం బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్‍కు టచ్లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగించేది. వారంతా డ్రగ్స్ మత్తులో ఉన్న బాలికపై అత్యాచారం చేసి కామవాంఛలు తీర్చుకునే వారు. అనంతరం బాలికను తిరిగి ఆ మహిళకు అప్పగించేవారు. ఈ విధంగా బాలికలను వివిధ జిల్లాలకు సైతం కిలేడీ తిప్పేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం మిల్స్ కాలనీలో ఓ బాలిక కిడ్నాప్ అయ్యింది. చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రెండ్రోజుల తర్వాత బాలిక తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ఈ విషయం పోలీసులకు తెలపగా బాలికను ఆరా తీశారు.

నిన్ను ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారంటూ పలు ప్రశ్నలు సంధించారు. ఓ మహిళ తనకు కొన్ని రోజుల క్రితం పరిచయం అయ్యిందని, బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లిందని వెల్లడించింది. అనంతరం మత్తుమందు ఇచ్చిందని ఆ తర్వాత ఏం జరిగింతో తెలియదంటూ చెప్పుకొచ్చింది. ఈ మేరకు సదరు బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఖాకీలు వైద్య పరీక్షలు చేయించారు. దీంతో డ్రగ్స్ పాజిటివ్‍గా తేలింది.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కిలేడీ గ్యాంగ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరి ఆకృత్యాలు తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా పిల్లలను పాఠశాలలకు పంపించాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఒక్క వరంగల్ నగరమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్‍లు ఇంకేమైనా ఉన్నాయా? అనే ఆలోచనలో పడ్డారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి గ్యాంగ్‍లను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు..

Exit mobile version