సకల సౌకర్యాలతోమహా మేడారం జాతర – మంత్రి సీతక్క

సకల సౌకర్యాలతో మహా మేడారం జాతర – మంత్రి సీతక్క

జాతర సమయానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం

మేడారం మాస్టర్ ప్లాన్ అమలు – భక్తుల సౌలభ్యం ప్రధాన లక్ష్యం

సమ్మక్క సారలమ్మల త్యాగ ఔన్నత్యానికి తగిన వేడుకగా మహా జాతర

మేడారం మహా జాతర ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ సమీక్షలో మంత్రి సీతక్క

సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర ఉన్నతాధికారులు, పలు విభాగాల ఇంజనీర్లు హాజరయ్యారు.

సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనల మేరకు మేడారం దేవాలయ ప్రాంగణం నూతన డిజైన్‌ను మంత్రులు పరిశీలించారు. డిజైన్‌లో అవసరమైన మార్పులపై చర్చించి, తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మేడారం నిర్వహణ పనులను సకాలంలో పూర్తి చేయాలని, మహా జాతర ప్రారంభానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పూజారుల అభిప్రాయం మేరకు ఆధునికరణ పనులు చేపట్టాలని సూచించిన ఆమె, భక్తుల దర్శనార్థం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలో అమర్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శించుకునేలా గద్దెల ఎత్తును పెంచాలన్న పూజారుల అభ్యర్థనను కూడా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి సీతక్క, జాతర సమయంలో భక్తులకు సహాయపడేందుకు వాలంటీర్లను నియమించనున్నట్లు ప్రకటించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా మేడారం పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని, మేడారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ మహా జాతరకు 150 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. అవసరమైతే ఇతర శాఖల సహాయంతో అదనపు నిధులు కూడా కేటాయిస్తామని తెలిపారు.

జాతర నిర్వహణ ఏర్పాట్లు, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను ముఖ్యమంత్రికి నివేదించి, వారి ఆమోదం తర్వాత పనులు వేగవంతం చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ముందుకు వెళ్తామని, మేడారం అభివృద్ధి ప్రతి దశలో పూజారులను భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోందని తెలిపారు. మేడారం ఆలయం తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని దేవాలయాలను అలంకరించాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశం ద్వారా భక్తులందరికీ సౌకర్యవంతమైన వాతావరణంలో మహా మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment