రెండు పడకల ఇళ్లకు అన్ని మౌలిక వసతులు కల్పించాలి – జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 25:
జిల్లాలోని రెండు పడకల ఇళ్ల లబ్ధిదారులకు అన్ని మౌలిక వసతులు సమగ్రంగా అందించాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం అదనపు కలెక్టర్ రాధిక గుప్తాతో కలిసి శామీర్‌పేట మండలం, మురహరపల్లి గ్రామంలోని రెండు పడకల ఇళ్ల సముదాయాలను పరిశీలించిన కలెక్టర్, మిషన్ భగీరథ అధికారులను నీటి సరఫరా తగిన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ అనుమతులలో జాప్యం జరుగుతున్నందున, ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని అటవీ, మిషన్ భగీరథ అధికారులకు సూచించారు.
లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, వారు కోరిన ప్రహరీ గోడ నిర్మాణంపై వెంటనే స్పందిస్తూ ఆర్‌అండ్‌బి శాఖను అవసరమైన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా సహా మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి, అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు.
తదుపరి రాంపల్లి సమీపంలోని రెండు పడకల ఇళ్లను కూడా పరిశీలించిన కలెక్టర్, పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రమణమూర్తి, శామీర్‌పేట తహసీల్దార్ యాదగిరి రెడ్డి, అటవీ, విద్యుత్, ఆర్‌అండ్‌బి, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.