ఆస్తులన్నీ అమ్మి చదివించాం – ఇప్పుడు రోడ్డున పడేశాడయ్యా!… ఓ తల్లిదండ్రుల ఆవేదన

*ఆస్తులన్నీ అమ్మి చదివించాం – ఇప్పుడు రోడ్డున పడేశాడయ్యా!… ఓ తల్లిదండ్రుల ఆవేదన*

ఒక్కగానొక్క కుమారుడు అని ఆ తల్లీదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకున్నారు.

తమ కుమారుడిని ఉన్నతస్థానంలో చూడాలని కలలు కన్నారు.

కాయాకష్టం చేసి ఉన్నత చదువులు చదివించారు. ఆస్తులు అమ్మి ప్రయోజకుడిని చేశారు.

ఉన్నదంతా కరిగిపోయినా తమ బిడ్డ అమెరికాలో స్థిరపడ్డాడని ఆ అమాయక తల్లీదండ్రులు సంతోషపడ్డారు.

అయితే ఆ సంతోషం వారికి ఎంతోకాలం లేదు.

విదేశాలకు వెళ్లిన కుమారుడు తల్లిదండ్రుల బాగోగులు చూడకపోవడం వల్ల తల్లడిల్లిపోయారు.

చివరికి కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి వచ్చింది.

పల్నాడు జిల్లా, మాచర్ల మండలం విజయపురిసౌత్‌కు చెందిన బ్రహ్మారెడ్డి, విజయలక్ష్మి దంపతులు నివసిస్తున్నారు. వీరి కుమారుడు అంజిరెడ్డి. తమకున్న 8.5 ఎకరాల భూమితోపాటు ఆస్తులను అమ్మి కుమారుడిని ఉన్నత చదువులు చదివించారు. చదువు అనంతరం అతను అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా స్థిరపడ్డాడు. ఆ తర్వాత వృద్ధులైన దంపతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.

దుర్భర జీవనం గడపలేక ఆత్మహత్యాయత్నం:

అనారోగ్యంతోపాటు ఆర్థిక పరిస్థితి దిగజారడంతో దుర్భర జీవనం గడపలేక ఆ తల్లిదండ్రులు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి, నరసరావుపేటలో ఎస్పీ శ్రీనివాసరావును కలిసే ఏర్పాట్లు చేశారు. దీంతో ఎస్పీకి తమ బాధను తెలియజేశారు. గతంలో మాచర్ల పోలీసులకు కుమారుడిపై ఫిర్యాదు చేశామని, ఓ వైఎస్సార్సీపీ నాయకుడి అండతో కేసును నీరుగార్చారని వాపోయారు.

పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు తెలిపారు. దిక్కులేక కోర్టులో కేసు వేశామని, నెలకు రూ.10 వేలు భరణం ఇవ్వాలని కోర్టు తీర్చు ఇచ్చిందని కానీ కోర్టు తీర్పును కూడా తమ కుమారుడు ఖాతరు చేయడం లేదని ఎస్పీకి తెలియజేశారు. ఈ క్రమంలోనే గురువారం (10/04/2025) మాచర్ల పర్యటనకు వచ్చిన ఎస్పీ ఆ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లారు. వారితో మాట్లాడి న్యాయం చేస్తానని మరోసారి హామీ ఇచ్చారు. ఎస్పీ వెంట తహసీల్దారు కిరణ్‌కుమార్, రూరల్‌ సీఐ నఫీజ్‌ బాషా, ఎస్సై మహమ్మద్‌ షఫీ తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment