ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు ..

ఆ ముగ్గురూ కీలకంగా వ్యవహరించారు – ఇంటివద్ద రెక్కీ చేశారు: ముంబయి నటి

వైఎస్సార్సీపీ హయాంలో పోలీసు అధికారుల వేధింపుల వ్యవహారంపై ముంబయి నటి..

విజయవాడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో కీలక వివరాలు వెల్లడించారు..

తనపై కేసు నమోదుకు ముందే ముంబయిలో రెక్కీ నిర్వహించారన్న ఆమె ఆ తర్వాతే విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి తనపై కేసు పెట్టారని చెప్పినట్లు తెలిసింది.

ఈ వ్యవహారంలో సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్ని కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నట్లు సమాచారం.

IMG 20240831 WA0082

పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు ముంబయిలో కేసు ఉపసంహరణకు ఒత్తిడి చేశారని, బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.వైఎస్సార్సీపీ నేత, పోలీసు అధికారుల నుంచి వేధింపుల వ్యవహారంలో ముంబయి సినీ నటి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాదులతో కలిసి విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబు కార్యాలయానికి వెళ్లిన ఆమె తనపై జరిగిన వేధింపులు వివరించి న్యాయం చేయాలని ఆయన్ను కోరారు. తర్వాత విచారణ అధికారి అయిన ఏసీపీ స్రవంతిరాయ్‌ను కలిసి ఫిర్యాదు కాపీ అందజేశారు. తనవద్ద ఉన్న డాక్యుమెంట్‌ ఆధారాలు, ఆడియో, వీడియో, ఫొటోలను అందించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల 15నిమిషాలకు మొదలైన విచారణ రాత్రి 10గంటల 15 నిమిషాల వరకు సాగింది.తనపై తప్పుడు కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు కీలకపాత్ర పోషించారని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీనివెనుక అప్పటి నిఘావిభాగం అధిపతి సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌ గున్ని ఉన్నారని దర్యాప్తు అధికారికి వివరించారని తెలిసింది. విజయవాడలో తనపై కేసు నమోదుచేసే ముందే ఇంటెలిజెన్స్‌ బృందాన్ని సీతారామాంజనేయులు ముంబయి పంపి తమ ఇంటివద్ద రెక్కీ చేశారని, అంతా అనుకూలంగా ఉందని ఖరారు చేసుకుని ముందస్తు ప్రణాళికలో భాగంగా విద్యాసాగర్‌తో ఫిర్యాదు ఇప్పించి, కేసు నమోదుచేశారని, ఆమె పోలీసులకు నివేదించినట్లు సమాచారం.వెంటనే విజయవాడ పోలీసులు ముంబై వచ్చి అక్కడ కేసు ఉపసంహరించుకోవాలని తనపై ఒత్తిడి చేసి సంతకాలు తీసుకున్నారని చెప్పినట్లు సమాచారం. తనపై ఎక్కడా కేసులు లేవని, అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ప్రచారం చేస్తున్నారని వివరించారని తెలిసింది. తాను పలువురిని హనీట్రాప్‌ చేసినట్లు ప్రచారం చేయడం తగదన్న ఆమె, ముంబయిలో ప్రస్తుతం ఉంటున్న ఇంటిని 2020లో కొన్నానని, ఆ చిరునామాతో 2018నాటి తేదీతో బోగస్‌ ఒప్పంద పత్రం సృష్టించారని దర్యాప్తు అధికారికి చెప్పారు.తన ఇంటిపత్రాలను అందజేశారు. వృద్ధులైన తన తల్లిదండ్రులను కేసులో అనవసరంగా ఇరికించారని చెప్పారు. దుబాయ్‌లో ఉంటున్న తన సోదరుడినీ ఏ4గా చేర్చారని వివరించారు. 42 రోజులపాటు తాను రిమాండ్‌లో ఉన్నానని, బెయిల్‌ కోసం న్యాయవాదులను సంప్రదించే అవకాశం కూడా లేకుండా పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనివల్ల బెయిల్‌కు దరఖాస్తు చేసేందుకు ఎక్కువ సమయం పట్టిందని విచారణ అధికారి ఎదుట వాపోయినట్లు తెలిసింది.41ఏ సీఆర్పీసీ నోటీసు ఇవ్వాల్సిన కేసులో నటి కుటుంబాన్ని అన్యాయంగా అరెస్టు చేశారని ఆమె న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వివరించారు. ఆమెకు న్యాయసహాయం అందించేందుకు 10 మంది న్యాయవాదులం వచ్చామని, బాధితురాలికి న్యాయసహాయం చేయడం తమ ధర్మమని చెప్పారు. ఆమెకు అన్నివిధాలుగా అండగా నిలుస్తామని తెలిపారు.నాతోపాటు నా కుటుంబమంతటిపై తప్పుడు కేసు పెట్టారు. పారిశ్రామికవేత్తపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 40 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నన్ను కిడ్నాప్‌ చేశారు. నా ఎలక్ట్రానిక్‌ వస్తువులను సీజ్‌ చేశారు. అలాంటప్పుడు ముంబయి కేసులో నేను ఆధారాలు ఎలా ఇవ్వగలను? ఆ కేసుతో సంబంధంలో భాగంగానే నాపై తప్పుడు కేసు పెట్టారని భావిస్తున్నాను. ఆ కేసును మూసివేసే ప్రయత్నంలో భాగంగానే ఈ కేసు పెట్టారనుకుంటున్నాను. బలమైన వ్యక్తులకు క్లీన్‌చిట్‌ ఇచ్చే క్రమంలో నన్ను తీవ్రంగా వేధించారు. అన్నింటికీ నన్నే బాధ్యురాలిని చేశారు. వాటికి నేనెలా బాధ్యురాలిని అవుతాను. నేను, నా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం. నా తండ్రి వినికిడి కోల్పోయారు. మా అమ్మకు గుండె, బీపీ సంబంధిత సమస్యలు వచ్చాయి. నాకు నరాల సమస్య వచ్చింది.ఎలాంటి ఆధారాలు లేకుండా నాపై తప్పుడు కేసు ఎందుకు పెట్టారన్నదే నా ప్రశ్న. అప్పటి విజయవాడ కమిషనర్‌ కాంతిరాణా టాటా మార్గదర్శకత్వంలో పని చేసిన అధికారులే దీనికి బాధ్యత వహించాలి. ఈ వ్యవహారంలో రాజకీయ ప్రమేయంపై విచారణ జరగాలి”.ముంబయి నటి..

Join WhatsApp

Join Now