ప్రజా జీవితాన్ని మెరుగుపర్చడానికి మూడు వ్యవస్థలూ కలిసి పనిచేయాలి

 ప్రజా జీవితాన్ని మెరుగుపర్చడానికి మూడు వ్యవస్థలూ కలిసి పనిచేయాలి

– రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా జీవితాన్ని మెరుగుపర్చడానికి కార్యనిర్వహక, చట్టసభ, న్యాయవ్యవస్థలు కలిసి పని చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉద్భోధించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా సంవిధాన్‌ సదన్‌ (పాత పార్లమెంట్‌)లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. దేశ వ్యవస్థాపక పత్రంలో ప్రతి పౌరుడి ప్రాథమిక విధులు స్పష్టంగా నిర్వచింబడిందని, ఇవి దేశ ఐక్యత, సమగ్రత, సామరస్యం, మహిళల గౌరవాన్ని రక్షించడానికి, ప్రోత్సహించడానికి ఉద్దేశించబడినవి అని తెలిపారు. కార్యనిర్వహక, చట్టసభ, న్యాయవ్యవస్థలతో పాటు ప్రజలంతా కూడా సక్రమంగా పాటించినప్పుడే రాజ్యాంగ ఆదర్శాలు బలవంతమవుతాయని అన్నారు. ప్రజల జీవితాన్ని మెరుగుపర్చడానికి కలిసిపనిచేయడం కార్యనిర్వహక, చట్టసభ, న్యాయవ్యవస్థల బాధ్యత అని రాష్ట్రపతి తెలిపారు. పార్లమెంట్‌ రూపొందించిన అనేక చట్టాల్లో ప్రజల ఆకాంక్షలు వ్యక్తమవుతున్నాయని, బలహీనవర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. న్యాయవ్యవస్థ మరింత ప్రభావంతంగా మార్చేందుకు సుప్రీంకోర్టు చేస్తున్న ప్రయత్నాలు సంతోషం కలిగిస్తున్నాయని అన్నారు.భారతదేశ రాజ్యాంగం సజీవమైన, ప్రగతిశీల పత్రమని, మారుతున్న కాల అవసరాలకు అనుగుణంగా నూతన ఆలోచనలను స్వీకరించే వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు అందించారని చెప్పారు.

దేశ పరివర్తనకు దోహదం పడిన రాజ్యాంగం : సీజేఐ

స్వాతంత్య్రం తరువాత శక్తివంతమైన ప్రజాస్వామ్య, భౌగోళిక రాజకీయ నాయకుడిగా భారత్‌ ఉద్భవించిందని, ఈ పరివర్తనకు దేశ రాజ్యాంగం సహాయపడిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌ ఖన్నా తెలిపారు. దేశ విభజన, తీవ్రమైన నిరక్షరాస్యత, పేదరికం, ప్రజాస్వామ్యానికి పరీక్షలు వంటి పరిణామాలు తరువాత భారత్‌ స్వీయ-హామీ కలిగిన దేశంగా మారిందని, ఈ పరివర్తనకు రాజ్యాంగం దోహదపడిందని చెప్పారు. సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో కోర్టులకు రాజ్యాంగం విశిష్ట స్థానాన్ని కల్పించిందని చెప్పారు. సీజేఐగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి బార్‌ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సమావేశంలో అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, ఎస్‌సిబిఎ అధ్యక్షులు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ తదితరులు ప్రసంగించారు.

తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో రాజ్యాంగం అమలు : ప్రధాని మోడీ

జమ్మూకాశ్మీర్‌లో తొలిసారిగా దేశ రాజ్యాంగాన్ని అమలు చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో మనం ఎమర్జెన్సీని చూశాం. ప్రజాస్వామ్యం ముందు తలెత్తిన ఈ సవాలను మన రాజ్యాంగం ఎదుర్కొంది. ఇది రాజ్యాంగం యొక్క శక్తి. ఈ తరువాత ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌ ఈ రోజు జమ్మూకాశ్మీర్‌లో అంబేద్కర్‌ రాజ్యాంగం పూర్తిగా అమలువుతుంది. మొట్టమొదటిసారిగా అక్కడ(జమ్మూకాశ్మీర్‌)లో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు’ అని మోడీ చెప్పారు. 75వ రాజ్యాంగ దినోత్సవం యావత్‌ జాతికి గర్వకారణమని చెప్పారు. రాజ్యాంగం గౌరవం కాపాడ్డానికి ప్రయత్నిస్తున్నాని, దాన్ని ఎప్పుడూ అతిక్రమించలేదని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. ఇదే కార్యక్రమంలో భారత న్యాయవ్యవస్థ వార్షిక నివేదిక 2023-24ను మోడీ విడుదల చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment