*కూకట్పల్లి వై జంక్షన్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు*
*ముఖ్య అతిథులుగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి సర్వే, శేరి సతీష్ రెడ్డి లు*
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 14: కూకట్‌పల్లి ప్రతినిధి

బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వై జంక్షన్ వద్ద దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నివాళి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్రమంత్రి, మల్కాజిగిరి పార్లమెంట్ మాజీ సభ్యుడు సర్వే సత్యనారాయణ, కూకట్పల్లి నియోజకవర్గ మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను నేటితరం యువత ఆచరణలో పెడితే, ప్రతి మానవుడు మహనీయుడిగా ఎదగవచ్చన్నారు. న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయవేత్త, సంఘ సంస్కర్తగా, భారత రాజ్యాంగ శిల్పిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన అంబేద్కర్‌కు జయంతి సందర్భంగా మనం చేసే నివాళి అంటే ఆయన కలలను నెరవేర్చే సంకల్పం తీసుకోవడమే అని పేర్కొన్నారు. శేరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ దేవుడిలా ఉండే మనుషుల్లో ఓ మహాత్ముడన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వలనే నేడు దేశంలో ఒక వ్యవస్థ పని చేస్తోందన్నారు. రాజ్యాంగాన్ని అడ్డగోలుగా విమర్శించడం సరికాదని, రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అంబేద్కర్ గురించి మాట్లాడినప్పుడు, బీజేపీ నేత అమిత్ షా అంబేద్కర్ పేరు ప్రస్తావించకుండా రాముడి పేరుతో మతపరంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి బి. సంజీవరావు, కార్పొరేటర్ అభ్యర్థి విట్టల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు తమ్మినేని ప్రవీణ్ కుమార్, మేకల మైకల్, ఏఎంసీ సభ్యుడు ఫణీంద్ర కుమార్, రాజశేఖర్ రెడ్డి,దళిత ఐక్య వేదిక సభ్యులు ఎడ్ల ప్రభాకర్, ఎడ్ల సత్యనారాయణ, వి. బాబ్జి, దేవసహాయం, రేష్మ నాయుడు, పొడుగు అప్పారావు, అంబేద్కర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 9