*ఉగ్రవాదానికి భారత్ తలోగ్గదు… వారిని వదిలిపెట్టం… అమిత్ షా*
జమ్మూ కాశ్మీర్లోని పహాల్గం లో ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్ఛం సమర్పించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఎక్స్ ఖాతాలో ఆయనొక పోస్ట్ ఉంచారు.
భారమైన హృదయంతో పహల్గాం ఉగ్రదాడి మృతులకు నివాళులు. భారత్ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోం. బాధితుల ఆవేదనను ప్రతీ భారతీయుడు అనుభవిస్తున్నాడు అని ట్వీట్ చేశారాయన.
పహల్గాం ఉగ్రదాడి సమాచారం అందుకున్న వెంటనే మంగళవారమే అమిత్ షా జమ్ము కశ్మీర్ చేరుకున్నారు. బుధవారం ఉదయం మృతులకు నివాళులర్పించిన అనంతరం.. బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలు కన్నీళ్లతో షాను వేడుకుంటున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా.. ఘటన వెనక ఉన్నవారిని వదిలిపెట్టబోమని బాధిత కుటుంబాలతో అమిత్ షా స్పష్టం చేశారు.
ఆపై కాల్పులు జరిగిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన ఆయన.. అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.