రాజేంద్రనగర్ : నెలరోజుల పాటు ఓ ఇంట్లో నమ్మకంగా పనిచేసిన దంపతులు ఆ ఇంట్లో చోరీ చేసి పరారైన ఘటన రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. సన్‌సిటీలో నివాసం ఉండే డాక్టర్ కొండల్‌రెడ్డి ఇంట్లో నవంబరు నెలలో భార్యాభర్తలు పనికి కుదిరారు. బిహార్ రాష్ట్రానికి చెందిన నమీన్‌కుమార్‌యాదవ్, భారతిలుగా వారు తమ చిరునామా తెలిపారు. నెలరోజులగా ఇంట్లోనే ఉండి అక్కడి పనులు చేసే వారు. సోమవారం రాత్రి ఆ దంపతులు సంచి పట్టుకుని బయటకెళ్లారు. మంగళవారం ఉదయం కూడా ఇంటికి రాకపోవడంతో కొండల్‌రెడ్డి వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానం వచ్చిన కొండల్‌రెడ్డి కుటుంబసభ్యులు ఇంట్లోని అల్మారాను తనిఖీ చేశారు. 25 తులాల వివిధ రకాల బంగారు ఆభరణాలు, రూ.35 వేల నగదు మాయమైనట్లు గుర్తించారు. పని మనుషులుగా చేరిన వారే వాటిని చోరీ చేసి ఉడాయించినట్లు ఆయన రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.