ఆన్‌లైన్ గేమ్ బానిస… అప్పులు తీర్చేందుకు చోరీలు

ఆన్‌లైన్ గేమ్ బానిస… అప్పులు తీర్చేందుకు చోరీలు

వృద్ధురాలి గొలుసు లాక్కెళ్లిన విద్యార్థి

కామారెడ్డి పోలీసులు అరెస్ట్

 కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 12 

ఆన్‌లైన్ గేమ్స్‌కు (Online Games) బానిసై, ఇతర చోట్ల అప్పులు చేసి వాటిని తీర్చేందుకు చోరీలకు పాల్పడ్డాడు ఓ యువ విద్యార్థి. చివరకు పోలీసులకు చిక్కి జైలుకు చేరాడు.

కామారెడ్డి సబ్‌ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం,

పట్టణానికి చెందిన వృద్ధురాలు కొండ లలిత వివేకానంద కాలనీలో నివసిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని ఓ యువకుడు ఆమె వద్దకు వచ్చి “మంచినీళ్లు ఇవ్వండి” అని అడిగాడు. వృద్ధురాలు లోపలికి వెళ్లి నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే, ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కుని యువకుడు పారిపోయాడు.

ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు రావడంతో వారు విచారణ ప్రారంభించారు. కాలనీలో ఓ అనుమానితుడు తిరుగుతున్నట్లు స్థానికులు గుర్తించి సమాచారం అందించారు. పోలీసులు సీసీ కెమెరాల (CCTV) సాయంతో అతడిని గుర్తించి పట్టుకున్నారు.

అతడిని మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముగావ్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల దుయ్యవార్ రోహిత్ మారుతిగా గుర్తించారు. విచారణలో అతడు నీట్ పరీక్ష రాసి వెటర్నరీ సీటు సాధించినట్లు తెలిసింది. కానీ ఆన్‌లైన్ గేమ్స్‌కి బానిసై తండ్రి వద్ద రూ.20 వేలూ, స్నేహితుడి వద్ద రూ.40 వేలూ అప్పు తీసుకుని గేమింగ్‌లో పోగొట్టుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక డిప్రెషన్‌లోకి వెళ్లి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

అతడు నాందేడ్ నుంచి రైలులో కామారెడ్డికి వచ్చి వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఏఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ,

 “ఒంటరి మహిళలు, వృద్ధులు అపరిచితులను నమ్మవద్దు. యువత ఆన్‌లైన్ గేమ్స్‌కి దూరంగా ఉండాలి. వాటికి బానిసైతే విలువైన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు.

కొద్ది నెలల క్రితం ఆన్‌లైన్ గేమింగ్‌లో అప్పులు చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటనను గుర్తు చేశారు.

సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment