సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 14 (ప్రశ్న ఆయుధం న్యూస్): గ్రంథాలయాలను సమర్థంగా వినియోగించుకోవాలని, పాఠకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అంజయ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి వసుంధర ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, డా. ఎస్.ఆర్. రంగనాథన్, సరస్వతి దేవి చిత్రపటాలకు పూలమాలలు వేసి వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ… గ్రంథాలయాలను సరైన విధంగా వినియోగించుకోవాలని, ఇక్కడ చదువుకున్న అనేక మంది వివిధ విభాగాల్లో ఉన్నత పదవులు సాధించారని తెలిపారు. అవసరాలపై అధికారుల దృష్టికి తీసుకువస్తే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రచయిత రాజశేఖర్ రెడ్డి రచించిన “పర్సనాలిటీ డెవలప్మెంట్” పుస్తకాన్ని గ్రంథాలయానికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది శ్రీనివాస్, ప్రశాంత్, శోభారాణి, వరలక్ష్మి, సావిత్రి, కృష్ణమూర్తి, నాగరాజు, బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుడు నరేంద్ర, సాహితీ పాఠశాల బాలికలు, గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రంథాలయాలను సమర్థంగా వినియోగించుకోవాలి: గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు అంజయ్య
Published On: November 14, 2025 5:32 pm