వైభవంగా వార్షికోత్సవ వేడుకలు
గజ్వేల్ నియోజకవర్గం, 10 ఫిబ్రవరి 2025 : ప్రసిద్ధ వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్రంలో సోమవారం వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని శ్రీ విద్యాధరి క్షేత్రం తో పాటు శ్రీ శనైశ్చర, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ శంభు లింగేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ ఆలయాలకు పుట్టినిల్లుగా వర్గల్ శంభూ గిరి కొండలు విశేష ప్రాచుర్యం పొందినట్లు పేర్కొన్నారు. నిత్యం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుండగా, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలో భగవన్నామస్మరణ, ఆధ్యాత్మిక చింతన అలవర్చడం తమ లక్ష్యమని అన్నారు. గత 34 ఏళ్లుగా శ్రీ విద్యాధరి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా, చదువుల తల్లిగా, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు విశేష సేవనందిస్తూ తరిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ నిర్వాహకులు పొద్దుటూరి నరసింహారావు, దాచేపల్లి వెంకట కృష్ణారావు, బొమ్మిడాల సత్యనారాయణ, గంగా శ్రీనివాస్ గుప్తా, ఇర్రి మల్లారెడ్డి, గంగిశెట్టి సుధాకర్ గుప్త, నూక బిక్షపతి గుప్త, రేణిగుంట శ్రీనివాస్ గుప్తా, రంగయ్య గుప్త, దోసపాటి లక్ష్మణరావు గుప్త తదితరులు పాల్గొన్నారు.