కామారెడ్డిలో మూడు రోజుల్లోనే వార్షిక వర్షపాతం 40%
38 కోట్లు తాత్కాలికం – 210 కోట్లు శాశ్వత పునరుద్ధరణ ప్రతిపాదనలు
కామారెడ్డి, సెప్టెంబర్ 01 (ప్రశ్న ఆయుధం):
భారీ వర్షాలు, వరద సహాయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సెక్రటేరియట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ –
జిల్లాలో సంవత్సర సగటు వర్షపాతం 983 మిల్లీమీటర్లు కాగా, ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లోనే 400 మిల్లీమీటర్లు కురిసిందని, ఇది సంవత్సర సగటు వర్షపాతంలో 40 శాతం అని వెల్లడించారు. భారీ వర్షాల వలన దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు తాత్కాలికంగా 38 కోట్లు, శాశ్వత పనుల కోసం 210 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు.వర్షాల ప్రభావంతో రవాణా నిలిచిపోయిన గ్రామాలు, పట్టణాలకు రోడ్లను వేగవంతంగా పునరుద్ధరించి రవాణా సౌకర్యం కల్పించామని చెప్పారు. జిల్లాలో 5 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా 108 పశువులు మృత్యువాత పడగా, వాటికి కూడా నష్టపరిహారం అందిస్తామని వివరించారు.జిల్లాలో 989 ఇండ్లకు 44 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. రేపటినుంచి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.