కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం

కేంద్రంపై మండిపడ్డ మావోయిస్టులు.. మరో సంచలన నిర్ణయం

రాయ్‌పూర్, అక్టోబర్ 21: దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అక్టోబర్ 24వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు మావోయిస్ట్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అభయ్ పేరుతో కేంద్ర కమిటీ మంగళవారం ఒక లేఖను విడుదల చేసింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తూ.. మావోయిస్టులను హత్య చేయడానికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు కేంద్ర కమిటీ విడుదల చేసిన ఆ లేఖలో పేర్కొంది. మావోయిస్టుల హత్యలకు నిరసనగా అక్టోబర్ 23వ తేదీ వరకు నిరసన వ్యక్తం చేయాలని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఆపరేషన్ కగార్ నిలిపి వేయడానికి దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని ఆ లేఖలో సూచించింది.

2026, మార్చి నెలాఖరు నాటికి మావోయిస్టులను శాశ్వతంగా నిర్మూలించి.. మావోయిస్ట్ రహిత భారత్‌గా మారుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా కేంద్రం ఆపరేషన్ కగార్‌ చేపట్టి.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆ క్రమంలో మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలని కేంద్రం పిలుపునిచ్చింది. దాంతో వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఇక దేశంలోని ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలు మావోయిస్టు రహితంగా మారాయి.

అయితే ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం మావోయిస్టులు బలంగా ఉన్నారు. దీంతో ఆ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు.. నిరంతరాయంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. దాంతో వరుస ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుని.. పలువురు మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. అలాగే వందల మంది మావోయిస్టులు సైతం మృతి చెందారు. భారీగా మావోయిస్టులు సైతం అరెస్టయ్యారు.

ఇంకోవైపు తాజాగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతగా ఉన్న మల్లోజులు వేణుగోపాల్ దాదాపు వంద మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట మరో మావోయిస్టు అగ్రనేత ఆశన్న సైతం వందల మందితో కలిసి లొంగిపోయరు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మావోయిస్టులు భారీగా ఆయుధాలను అప్పగించారు. అయితే మల్లోజుల వేణుగోపాలు, ఆశన్నలు ప్రభుత్వం ఎదట లొంగిపోవడంపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి నిప్పులు చెరిగింది. ఇది ముమ్మాటికి విప్లవ ద్రోహమంటూ వారిపై మండిపడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment