*ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…కేంద్ర మంత్రివర్గంలో చేరనున్నారా ?*
*విజయసాయిరెడ్డి స్థానంలో…ఆయన రాజ్యసభకు వెళ్లనున్నారా ?*
*ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కాకపోతే…ఇంకెపుడు బలపడుతామనే ఆలోచనలో కాషాయ పార్టీ నేతలు ఉన్నారా ?*
*2029 నాటికి బలమైన పార్టీగా అవతరించడానికి కమలం పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారా ? అందులో భాగంగానే పవన్ కల్యాణ్‌కు కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోనుందా ?*
ఆంధ్రప్రదేశ్‌లో బలపడటమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 175 స్థానాల్లో పోటీ చేసేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తెలుగుదేశం పార్టీపై ఎక్కువకాలం ఆధారపడితే..మనకే నష్టమనే ఆలోచనలో పడిపోయింది. అందులో భాగంగానే 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలంగా తయారు చేయాలన్న టార్గెట్‌గా పని చేస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఢిల్లీకి రావాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను రాజ్యసభకు పంపేలా మంత్రాంగం నడుపుతోంది. వైసీపీ తరపున ఎన్నికైన విజయసాయిరెడ్డి…రెండ్రోజుల క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ ఆమోదించారు. ఆయన దారిలోని మరికొందరు ఎంపీలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీని పూర్తి వీక్ చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో పవన్ కల్యాణ్‌ను పెద్దల సభకు పంపేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయింది. దీంతో పార్టీలోని మెజార్టీ నేతలు…పక్క చూపులు చూస్తున్నారు. కొందరు ఎన్నికల ముందు టీడీపీ, జనసేనలో చేరి…టికెట్లు తెచ్చుకున్నారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మిగిలిన నేతలంతా ఎపుడెపుడు బయటపడాలనే ఆలోచనతో ఉన్నారు. దీన్ని కాషాయ పార్టీ నేతలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీలోని అసంతృప్త నేతలను చేర్చుకొని బలపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే విశాఖ డెయిరీ ఛైర్మన్ అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరిపోయారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు. మంచి తరుణం మించినా దొరకదనే ఆలోచనలో ఉంది బీజేపీ అగ్రనాయకత్వం. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ…2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులతో 8 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. 2029లో ఈ సీట్లను మరింత గణనీయంగా పెంచుకోవాలని భావిస్తోంది.
పవన్ కల్యాణ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని…ఏపీలో డిప్యూటీ సీఎం పదవి తాను తీసుకోవాలనే వ్యూహంలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పవన్ కల్యాణ్‌కు ఢిల్లీకి రావాలని కబురు పంపినట్లు తెలుస్తోంది. 2029లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేసేలా…కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి పూర్తిగా వైసీపీని వీక్ చేసి…ఆ స్థానంలోకి బీజేపీ-జనసేన వెళ్లాలని చూస్తున్నాయి. అందుకే పవన్ ద్వారా తెరవెనుక రాజకీయం ప్రారంభించింది బీజేపీ.