ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
— అదనపు కలెక్టర్
అధికారులకు సూచనలు – ప్రజల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 13
జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి అందిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖాధికారులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలను వినిపించారు. ప్రజల వినతులను స్వయంగా స్వీకరించిన అదనపు కలెక్టర్ చందర్ నాయక్ మాట్లాడుతూ — “ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు సమర్థవంతంగా పరిష్కారం కావాలంటే అధికారులు ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి” అని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తరఫున మాట్లాడిన ఆయన, ప్రజలు నమ్మకంతో ప్రజావాణికి వస్తున్నారని గుర్తుచేస్తూ, వారి సమస్యలకు అర్హతల మేరకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి మొత్తం 90 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వార్తసింహారెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.