*• ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డికి జిల్లా పోలీసుల తరఫున ఘన వీడ్కోలు*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జులై 2
బదిలీపై హైదరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లనున్న ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డి కి, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై, డీఎస్పీని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…
జిల్లాలో ఏఆర్ డీఎస్పీగా యాకూబ్ రెడ్డి, అత్యుత్తమ సేవలు అందించారు. ఎన్నికల సమయంలో పార్లమెంట్, ఎమ్మెల్సీ మరియు పోటీ పరీక్షల సందర్భాల్లో భద్రత ఏర్పాట్లను విజయవంతంగా నిర్వహించారు. ఆయన శ్రద్ధ, నిబద్ధత, అంకితభావం పోలీస్ విభాగానికి మంచి పేరు తెచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగంలో బదిలీలు సర్వసాధారణం అయినా, ఎక్కడ పనిచేసినా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సేవలందించడం యాకూబ్ రెడ్డి, చూపిన మంచి ఉదాహరణ” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ యాకూబ్ రెడ్డి, మాట్లాడుతూ…
కామారెడ్డి జిల్లాలో ఏఆర్ విభాగంలో ఒక సంవత్సరం పాటు సేవలందించడం నాకు ఎంతో సంతృప్తికరంగా అనిపిస్తోంది. ఈ సమయంలో పోలీస్ అధికారుల సహకారం మరువలేనిది. జిల్లాలో యువశక్తితో, స్పష్టమైన విజన్‌తో పోలీస్ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్న జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నేతృత్వంలో పని చేయడం నా వృత్తి జీవితంలో గర్వకారణంగా నిలిచింది. ఆయన అందించిన మార్గదర్శనం, ప్రోత్సాహం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అని డిఎస్పి, అన్నారు.ఈ వీడ్కోలు కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ, పీసీఆర్ సీఐ శ్రీధర్, ఆర్ఐలు, ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.