సమాజంలో దోపిడీ దౌర్జన్యాలు ఉన్నంతకాలం విప్లవ పోరాటాలు ఉంటాయి
అమరుల ఆశయాల వెలుగులో ప్రజా సమస్యలపై ఉద్యమాలు కొనసాగిద్దాం….
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పిలుపు
భూమి భుక్తీ విముక్తి సమసమాజస్థాపనకై భారత విప్లవోద్యమంలో పనిచేస్తూ తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన విప్లవ వీరుల పోరాటాన్ని కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) ఖమ్మం డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ వి రాకేష్ అన్నారు.*
సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కామేపల్లి మండలం హరిచంద్రపురం గ్రామంలో అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించి అనంతరం జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడుతూ నక్సల్భరి, శ్రీకాకుళం గోదావరి లోయ పోరాటాల వెల్లువలో భూమి పోరాటాలకు శ్రీకారం చుట్టి ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి లక్షలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టింది కమ్యూనిస్ట్ విప్లవకారులేనని, ఈ క్రమంలో పేద ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులను పోలీసులు,భూస్వాములు, గుండాలు ఏకమై అనేక మంది విప్లవకారులను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విప్లవకారులు అసమాన త్యాగాలు చేస్తూ ప్రజలకు అవసరమైన భూమి సమస్య, నిరుద్యోగ సమస్య పరిష్కరించబడాలని, దేశంలో ఆకలి మంటలు,దారిద్య్రం పోవాలని పోరాడి విప్లవకారులు చీకట్లో మగ్గి ప్రజలకు వెలుతురుని పెంచారని అన్నారు. విప్లవకారుల కృషి ఫలితంగానే విద్యా,వైద్యం,మంచినీటి సమస్య,రాహదారుల సమస్య పరిష్కరించుకొని ప్రజల అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని వారు తెలిపారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఆధిపత్య బ్రాహ్మణీయ భావజాలాన్ని విస్తృత పరుస్తూ ప్రజలను,విద్యార్థులను మూఢత్వం వైపు ప్రయాణించేలా విషపు ప్రయత్నాలు కొనసాగిస్తుందని బిజెపి,ఆర్ఎస్ఎస్ కుట్రలను బట్టబయలు చేస్తూ మతోన్మాదులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమాజంలో దోపిడీ దౌర్జన్యాలు ఉన్నంతకాలం విప్లవకారులు పుడుతూనే ఉంటారని సమాజం కోసం పోరాటాలు చేపడతారని వారు అన్నారు. కులం,మతం విద్వేషాలకు, దోపిడీ పీడన లకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలను నిర్వహిస్తూ సమాజ మార్పులో ప్రజలు భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు మంగీలాల్ కిషన్ సామ్యా వాగ్య ధస్మా సోనీ గాంధీ లాల్ సింగ్ సాల్కు తదితరులు పాల్గొన్నారు.