వానాకాలం పంటలకు బీమా లేనట్లే!
టెండర్లు పిలవని ప్రభుత్వం.. ఆర్థిక సమస్యలే కారణం!
ప్రకృతి విపత్తుల్లో తక్షణ సాయం.. ఎకరానికి రూ.10 వేలు
హైదరాబాద్, జూలై 1 రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు మొదలై నెల రోజులు గడిచిపోయాయి.
అయినా పంటల బీమా పథకానికి ప్రభుత్వం టెండర్లు పిలవలేదు. అంటే ఈసారికి పంటల బీమా ఉండదని తేటతెల్లమైంది. ఈ సీజన్‌కు పంటల బీమా పథకాన్ని అమలు చేయడంలేదు. గత బడ్జెట్‌లో రూ.1,300 కోట్ల కేటాయింపులు చేసినప్పటికీ ఇప్పుడున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఇంత భారీ మొత్తాన్ని పంటల బీమాకు కేటాయించే పరిస్థితి లేదనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఒకవేళ ప్రకృతి విపత్తులు సంభవిస్తే ఎప్పటికప్పుడు పంట నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం కింద పరిహారం పంపిణీ చేయాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. ఇందులో వానాకాలంలో 1.30 కోట్లకుపైగా ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేస్తున్నారు. పంటలు చేతికొచ్చే దశలో అకాల వర్షాలు, వడగండ్లతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో పంటలకు బీమా చేయడం అనివార్యంగా మారింది. అయితే బీఆర్‌ఎస్ హయాంలో 2019-20 వరకే రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలైంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కూడా అప్పట్లోనే బయటకు వచ్చింది. 2023 డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. పీఎం-ఎ్‌ఫబీవైలో చేరడంతోపాటు మెరుగైన పంటల బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కసరత్తు కూడా చేసింది. అయితే, పంటల సాగుకు ముందే బీమాకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. కానీ, మే, జూన్ నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియే చేపట్టలేదు. అంటే ఈ సీజన్‌కు పథకం అమలు చేయడం లేదన్నమాట.
*_ఆర్థిక భారం అవుతుందనే..!_*
పంటల బీమా పథకాన్ని అమలు చేయాలంటే కనీసం రూ.1000 కోట్లకు పైగా కావాలి. 2019-20లోనే ప్రీమియం ఖర్చు రూ.881 కోట్లు అయ్యింది. ఇప్పుడింకా పెరుగుతుంది. 2024-25లో రూ.1,300 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.1,300 కోట్ల చొప్పున పంటల బీమాకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. కానీ, ఇంత భారీ మొత్తంలో నిధులు సర్దుబాటు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సాఽధ్యం కాదనే చర్చ జరిగినట్లు తెలిసింది. రెండు పంటలకు కలిపితే ఏడాదికి రూ.2,600 కోట్లు సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఇంత భారీ బడ్జెట్ ఇప్పుడు సాఽధ్యం కాదని, అందుకే పంటల బీమా పథకం పునరుద్ధరణకు ముందడగు వేయలేదని తెలిసింది. మరోవైపు పంటల బీమా పథకం అమలు చేస్తే.. రైతుల కంటే బీమా కంపెనీలకే ఎక్కువ లాభం కలుగుతున్నదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో బీమా కంపెనీలకు చెల్లించిన ప్రీమియం, రైతులకు అందిన నష్టపరిహారం లెక్కలు కూడా తీసినట్లు సమాచారం. 2019-20లో బీమా కంపెనీలకు రూ.881 కోట్ల ప్రీమియం చెల్లించగా.. రైతులకు రూ.509 కోట్ల నష్టపరిహారం వచ్చింది. ప్రీమియం, క్లెయిమ్‌కు మధ్య తేడా 372 కోట్లు ఉంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు నష్టపరిహారం ఇవ్వడమే మేలన్న ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
*_ఎకరానికి రూ.10 వేలు_*
గడిచిన రెండు, మూడు సీజన్లలో పంటలు నష్టపోయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేయించింది. ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసింది. 2024-25, 2025-26 సంవత్సరాల్లో ఐదు సార్లు అకాల వర్షాలు రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.140 కోట్లు పంపిణీ చేసింది.ప్రస్తుతానికి ఇదే పద్ధతిని కొనసాగించాలని, రాబోయే రోజుల్లో పంటల బీమా పథకం పునరుద్ధరణపై ఆలోచన చేద్దామని సర్కారు నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.