ఆశ్లేష ప్రైవేట్ ఐటీఐ సర్టిఫికేట్ స్నాతకోత్సవం ఘనంగ
షామీర్పేట్, సెప్టెంబర్ 20 (ప్రశ్న ఆయుధం):
ఆశ్లేష ప్రైవేట్ ఐటీఐ కాలేజ్‌లో 2023–2025 బ్యాచ్ సర్టిఫికేట్ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మోడల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బీరం వెంకట రమణ హాజరై, విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసిన వెంటనే ఐటీఐ చదివి జీవితంలో స్థిరపడవచ్చని సూచించారు.
శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరస్పాండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు చదువును ఇక్కడితో ఆపకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని పరిశ్రమల్లో విజయవంతం కావాలని కోరారు. రవికుమార్ విద్యార్థులు తల్లిదండ్రుల మార్గదర్శకత్వాన్ని అనుసరించాలని సూచించారు.
కంపెనీ హెచ్.ఆర్. కరుణకుమార్ మాట్లాడుతూ, ఐటీఐలో పొందిన ప్రావీణ్యాన్ని పరిశ్రమల్లో అప్రెంటిస్షిప్ అవకాశాల కోసం వినియోగించుకోవాలని, సంవత్సరం వృథా కాకుండా తమ ప్రతిభను నిరూపించుకోవాలని సలహా ఇచ్చారు.
ప్రిన్సిపాల్ దామోదర్ మాట్లాడుతూ, ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్సు రాసి పాలిటెక్నిక్‌లో ద్వితీయ సంవత్సరం ప్రవేశం పొందవచ్చని, అదనంగా షామీర్పేట్–తుర్కపల్లి పారిశ్రామిక వాడల్లో ఉపాధి అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు.
చివరగా విద్యార్థులందరికీ సర్టిఫికెట్లు అందజేయడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.