బడ్జెట్‌లో రైతుభరోసాకు15 వేల కోట్లు కేటాయింపు.
ఎకరానికి 15 వేలు ఇస్తే.. సీజన్‌కు ఇచ్చేది కోటి ఎకరాలకే.
కేసీఆర్ హయాంలో సీజన్‌కు 1.53 కోట్ల ఎకరాలకు..
తాజా బడ్జెట్‌తో ప్రతి సీజన్‌లో 50 లక్షల ఎకరాలకు కోత
పెట్టుబడి సాయం రైతుభరోసా (రైతుబంధు)లో భారీ కోతకు రంగం సిద్ధమైంది. ఏటా సుమారు కోటి ఎకరాలకు కోత పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. తాజా బడ్జెట్ కేటాయింపులే ఇందుకు సాక్ష్యం. బడ్జెట్‌లో రైతుభరోసా పథకానికి ప్రభుత్వం రూ.15,075 కోట్లు మాత్రమే కేటాయించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తే, ఈ బడ్జెట్ కోటి ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. దీంతో మిగిలిన భూమికి కోత పెట్టడం ఖాయమని స్పష్టమవుతున్నది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి సీజన్‌లో 69 లక్షల రైతులకు సంబంధించిన 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు అందజేసింది. ఏడాదికి సుమారు 3 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేసింది.
సీజన్‌కు 50 లక్షల ఎకరాలకు కోత! బీఆర్‌ఎస్ ప్రభుత్వం సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల (ఏడాదికి రూ.10 వేలు) చొప్పున ఏటా రూ.15 వేల కోట్లు రైతుల ఖాతాల్లో ఎటువంటి పైరవీలు, షరతులు లేకుండా జమ చేసింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఈ మొత్తాన్ని సీజన్‌కు రూ.7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఒక్కో సీజన్‌కు 1.53 కోట్ల ఎకరాలకు రైతుభరోసా అందించేందుకు సుమారు రూ.11,475 కోట్లు, ఏడాదికి సుమారు రూ.23 వేల కోట్లు అవసరం. కానీ, బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం. ఈ లెక్కన ఏడాదికి రెండు కోట్ల ఎకరాలకు మాత్రమే రైతుభరోసా పంపిణీ చేయనున్నది. గతంతో పోల్చితే ఏడాదికి కోటి ఎకరాలకు కోత పెట్టనున్నది. సీజన్‌కు 50 లక్షల ఎకరాలకు రైతుభరోసా వచ్చే అవకాశం లేదు. భరోసాకు పీఎం కిసాన్ నిబంధనలు!ఇప్పటికే రుణమాఫీలో రేషన్‌కార్డు లేని వారికి, ఆదాయపు పన్ను చెల్లించేవారికి, ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇకపై రైతుభరోసాలోనూ కోత పెట్టుందుకు రంగం సిద్ధంచేస్తున్నది. ఈ పథకానికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్ నిబంధనలనే ప్రామాణికంగా తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. అంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నది! రేవంత్‌రెడ్డి సర్కార్ మోదీ ప్రభుత్వ మార్గాన్ని ఎంచుకుంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లించేవారికి రైతుభరోసా రావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు రైతుభరోసా భూమికి సీలింగ్ పెట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది.ప్రతి రైతుకు 5 ఎకరాలు లేదా 10 ఎకరాల సీలింగ్ విధించే అంశంపై ఆలోచన చేస్తున్నది. ఈ నిబంధన అమలు చేస్తే మరింత మందికి రైతుభరోసాలో కోత పడటం ఖాయం. కోతలపై ఇప్పటికే ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటుచేసి జిల్లాల్లో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాత రైతుభరోసా అమలుచేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కమిటీ రైతుభరోసాపై నివేదిక అందించలేదు. దీంతో ఈ అసెంబ్లీ సెషన్‌లో రైతుభరోసాపై చర్చ ఉంటుందా? లేదా? అనే సందేహం వ్యక్తమవుతున్నది. దీనిపై ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.