మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి — నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్

**మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి — నిందితులకు కఠిన శిక్ష విధించాలన్న డిమాండ్**

మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం మే 6

మతిస్థిమితం లేని దళిత యువకుడిపై దాడి చేసిన దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎన్బీఎంఐ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా అధ్యక్షుడు రవి రాజ్ రాథోడ్ డిమాండ్ చేశారు.మంగళవారం కీసరలోని స్థానిక కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో ఇటీవల జరిగిన అమానుష ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బేడ బుడగ జంగం కులానికి చెందిన మతిస్థిమితం లేని యువకుడు అజయ్ కుమార్ ఆంజనేయ స్వామి గుడిలోకి ప్రవేశించాడనే కారణంతో కొందరు వ్యక్తులు అతడిని పాశవికంగా వేధించారని చెప్పారు.అతడి చేతులు, కాళ్లు కట్టేసి, బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించడం అనేది సభ్య సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రాథోడ్, నిందితులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలన్నారు.ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఎన్బీఎంఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రాథోడ్ హెచ్చరించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు.

Join WhatsApp

Join Now