ఫ్యాక్టరీల భద్రతపై అవగాహన కార్యక్రమం: ప్రమాద నివారణకు కఠిన చర్యలు
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ప్రశ్న ఆయుధం ఆగస్టు 7
రసాయన మరియు ఔషధ కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టరేట్‌లో గురువారం అవగాహన సమావేశం నిర్వహించబడింది. జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
రసాయన, ఫార్మా ఫాక్టరీలపై ప్రత్యేక దృష్టి:
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జిల్లాలో చోటుచేసుకున్న పరిశ్రమల ప్రమాదాలను పరిగణనలోకి తీసుకొని, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కర్మాగారాలను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.
మొదటి దశలో రసాయన మరియు ఫార్మా కర్మాగారాలు, అనంతరం ఇతర ప్రమాదకర పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. భద్రతా వ్యవస్థల మెరుగుదల కోసం యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పారిశ్రామిక క్లస్టర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు.
రాజీపడని విధానమే భద్రతకు బలమైన బేస్:
ఫ్యాక్టరీల డైరెక్టర్ వై. మోహన్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం భద్రత విషయంలో రాజీపడకుండా ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. తనిఖీల సమయంలో ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు.
చిన్న పెట్టుబడులతో కూడిన భద్రతా చర్యల ద్వారానే భారీ నష్టాలు, ప్రాణ నష్టాలు నివారించవచ్చని చెప్పారు.
భద్రతపై చైతన్యవంతమైన చర్చ:
బాయిలర్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై చైతన్యం పెంచడం ప్రధాన ఉద్దేశమని వివరించారు.
ఈ సమావేశంలో 100 మందికి పైగా ఫ్యాక్టరీ యాజమాన్యాలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.