నిజామాబాద్, సెప్టెంబర్ 27 (ప్రశ్న ఆయుధం):
నగరంలో ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచే క్రమంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ మరియు సిబ్బంది కోర్ట్ చౌరస్తా వద్ద వందన స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు భద్రతా నియమాలు, వాహనదారుల జాగ్రత్తలు తదితర అంశాలపై విద్యార్థులకు వివరించారు. రోడ్డు దాటేటప్పుడు జిబ్రా క్రాసింగ్‌ను మాత్రమే ఉపయోగించాలనీ, వాహనదారులు జీబ్రా క్రాసింగ్ వద్ద స్టాప్‌లైన్‌కు ముందుగానే వాహనాలను ఆపాలని తెలిపారు.
అదే విధంగా ట్రాఫిక్ సిగ్నల్స్‌లో ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల ప్రాముఖ్యత, వాటి ద్వారా ఎలా రవాణా నియంత్రించబడుతోందో వివరించారు. అలాగే మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్‌లు వాడకంలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వందన స్కూల్ విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు తెలిపారు.