సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 18 (ప్రశ్న ఆయుధం న్యూస్): జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ కార్యదర్శి బి.సౌజన్య అన్నారు. మంగళవారం నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జేఎన్ టీయూ యూనివర్సిటీలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో సంగారెడ్డి జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్ని విద్యా సంస్థలు యాంటి-డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, ఏవైనా అసాంఘిక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని విద్యార్థులను కోరారు. సంగారెడ్డిని మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చడం లక్ష్యమని చెప్పారు. అదనపు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు అవగాహన అత్యవసరం అని, ఈ లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం “మిషన్ పరివర్తన” కార్యక్రమం చేపట్టిందని వివరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి లలితకుమారి మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న లేదా వినియోగిస్తున్న వారిని నషా ముక్త్ భారత్ హెల్ప్‌లైన్ 14446 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చని విద్యార్థులకు సూచించారు. అనంతరం మాదకద్రవ్యాల దుర్వినియోగంపై పోస్టర్లను జిల్లా అధికారులు ఆవిష్కరించారు. విద్యార్థులతో నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ జోగిపేట్ సాగర్ రెడ్డి, జేఎన్ టీయూ ప్రొఫెసర్ విశ్వనాథ్ రాజు, దివ్యాంగుల శాఖ సీనియర్ సహాయకుడు వెంకటేశం, నషా ముక్త్ భారత్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్ ఉమేరా, ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు: జిల్లా న్యాయ అధికార సేవా సంస్థ కార్యదర్శి బి.సౌజన్య
Published On: November 18, 2025 6:31 pm