పీఎంఎల్ఏ 45(1) సెక్షన్ ప్రకారం బెయిల్‌సుప్రీంకోర్టు ధర్మాసనం..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో.. ఇవాళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. మనీల్యాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ)లోని సెక్షన్ 45 ప్రకారం .. బెయిల్‌కు కవిత అర్హురాలు అని ధర్మాసనం తెలిపింది. జస్టిస్ బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ఇచ్చింది. లిక్కర్ కేసులో దర్యాప్తు ముగిసిందని, కానీ విచారణ ముగిసేందుకు చాలా సమయం పడుతుందని ధర్మాసనం పేర్కొన్నది.దర్యాప్తు పూర్తి అయ్యిందని, ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారని, అప్పీల్ చేసుకున్న వ్యక్తిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్సీ కవిత అయిదు నెలలుగా జైలులో ఉన్నారని, కానీ ఈ కేసు విచారణ సమీప భవిష్యత్తులో పూర్తి అయ్యేటట్లు కనిపించడంలేదని, అనేక కేసుల్లో తీర్పు ఇచ్చిన తరహాలో.. విచారణ సమయంలో కస్టడీలో ఉంచడం శిక్షగా మారకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది.పీఎంఎల్ఏ లోని సెక్షన్ 45 ప్రకారం ఓ మహిళగా ప్రత్యేక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్సీ కవిత అర్హురాలు అని కోర్టు తెలిపింది. 45(1) ప్రొవిజన్ మహిళలకు ప్రత్యేక అవకాశాన్ని ఇస్తుందని కోర్టు స్పష్టం చేసింది. కవిత బెయిల్ పిటీషన్ కేసులో.. ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పీఎంఎల్ఏ కింద చదువుకున్న, ఆధునిక మహిళకు బెయిల్ ఇవ్వడం కుదరని ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీం తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను చట్టంగా అనుమతించలేమని, చదువుకున్న మహిళలకు బెయిల్ ఇవ్వకుండా అడ్డుకోవడం సరికాదు అని, ఎంపీ అయినా, సాధారణ వ్యక్తి అయినా.. న్యాయం ఒకే విధంగా ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది. పీఎంఎల్ఏ చట్టం విషయంలో హైకోర్టు జడ్జి తప్పుగా వ్యాఖ్యలు చేసినట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ఎమ్మెల్సీ కవితను బెయిల్‌పై రిలీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.