ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బంజారా మిషన్ ఆందోళన: ప్రభుత్వ జోక్యంకై డిమాండ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 26
ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులపై మోపుతున్న అధిక ఫీజుల భారంపై నేషనల్ బంజారా మిషన్ ఇండియా, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు రవిరాజ్ రాథోడ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే లక్షల్లో ఫీజులు పెంచుతూ విద్యను పూర్తిగా వాణిజ్యంగా మార్చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థి ఏడాది చదువు కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. పుస్తకాలు, యూనిఫార్ములు, బ్యాగులు, కంప్యూటర్ కోర్సులు అన్నీ తమ వద్దే కొనుగోలు చేయాలని పాఠశాలలు, కళాశాలలు బలవంతం చేస్తున్నాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోంది” అని రవిరాజ్ విమర్శించారు.
విద్యా హక్కు చట్టం అమలులో ఉన్నప్పటికీ, కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే, ప్రభుత్వం తక్షణమే రంగంలోకి దిగి, ఫీజులపై కఠినమైన నియంత్రణ నిబంధనలను తీసుకురావాలని రవిరాజ్ రాథోడ్ డిమాండ్ చేశారు.
రాష్ట్ర విద్యా శాఖ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని రవిరాజ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.