బీసీ కోటా ఓవర్‌ టు ఢిల్లీ.. 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్‌ సర్కార్‌..!!

*_BC Reservations | బీసీ కోటా ఓవర్‌ టు ఢిల్లీ.. 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి చేతులు దులుపుకొన్న కాంగ్రెస్‌ సర్కార్‌..!!_*

కేంద్రం ఆమోదిస్తేనే అమలు.. లేదంటే పార్టీ పరంగా వాటాకు సిద్ధమన్న రేవంత్‌

కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతరేసి కాంగ్రెస్‌ కొత్తపాట .. మండిపడుతున్న విపక్షాలు

42 శాతం బీసీ కోటాకు ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీ

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సమ్మతించాలని మెలిక

ఎంపీ ఎన్నికలకు ముందు కులగణనపై హడావుడి

రాజ్యాంగ సవరణతోనే సాధ్యమని మాట మార్పు

ఒడిశా బాటలోనే ముందుకు సాగుతున్న వైనం

ఆ చర్యలను ముందే చెప్పిన ‘నమస్తే తెలంగాణ’

అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ను నిలదీసిన బీఆర్‌ఎస్‌

ఫార్మాట్‌ మార్చి రీసర్వే చేయాల్సిందేనన్న తలసాని

ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ వాకౌట్‌

బీసీ గణన వెనుక కాంగ్రెస్‌ కుట్ర :మధుసూదనాచారి

బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గిందెలా?: కవిత

అనుకున్నంతా అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా అమలుకు సంబంధించి కాంగ్రెస్‌ నాటకం బట్టబయలైంది. చిత్తశుద్ధితో అమలుకు ప్రయత్నించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం కోటా బంతిని కేంద్రం కోర్టులోకి విసిరేసింది. నివేదిక తప్పులతడకగా ఉన్నదంటూ విమర్శలు వస్తున్నా అసంపూర్ణ నివేదికను ఆగమేఘాలపై అసెంబ్లీలో పెట్టడం, సభ ప్రారంభంలోనే తాను ప్రిపేర్‌ అయ్యి రాలేదని చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమైంది. కులగణనపై కేంద్రానికి నివేదించడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే దానిపై నెపం నెట్టేసి తప్పించుకునే యోచనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నట్టు బీసీ నేతలు విమర్శిస్తున్నారు.

న్యాయపరమైన అవరోధాల్ని అధిగమించి 42శాతం కోటా కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప అమలు సాధ్యం కాదు. కేంద్రం మెడలు వంచి, రాజ్యాంగ సవరణ చేయించాలంటే రాష్ట్రంలోని అన్ని పక్షాలను కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఆ మేరకు బీజేపీపై ఒత్తిడి పెంచాల్సి ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా కాంగ్రెస్‌ అడుగులు ఉన్నాయి. సర్వే నిర్వహణ, నివేదిక తయారీ, అసెంబ్లీలో చర్చ.. ఈ ప్రక్రియలన్నింటిలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నది. బీసీలకు తానేదో న్యాయం చేస్తానని ఇన్నాళ్లూ చెప్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన చిత్తశుద్ధిని చాటుకోగలదా? కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉన్నదా? ఇప్పుడిది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్‌-బీజేపీ ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకుంటూ కావాలని చేసే కాలయాపనతో బీసీలను రాజకీయ పావులుగా ఇరుపార్టీలు వాడుకునేలా కనిపిస్తున్నాయని సామాజిక వేత్తలు, బీసీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

BC Reservations | హైదరాబాద్‌, ఫిబ్రవరి 5 : అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్‌ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇక అందని ద్రాక్షగానే మిగలనున్నది. ఎప్పటిలాగే ఇచ్చిన మాటపై నాలుక మడతేసే కాంగ్రెస్‌ పార్టీ, బీసీలకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని సైతం అటకెక్కించేందుకు సిద్ధమైంది. 14 నెలలుగా బీసీలకు ఆశపెట్టి ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది! రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రగల్భాలు పలికి, ఆడంబరంగా హామీలు గుప్పించి ఇప్పుడు నాలుకమడతేసింది. ‘కేంద్రం ఒప్పుకొంటేనే’ అంటూ మెలిక పెట్టింది. లేదంటే పార్టీ పరంగానే 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కొత్తపాట పాడుతున్నది. ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్‌ సర్కారు ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన ఇంటింటి సర్వే నివేదికను అసెంబ్లీకి నివేదించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీల వారీగా లెక్కల వెల్లడించింది. ఆ తీర్మానంపై చర్చ సందర్భంగా త్వరలోనే బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ఏ ర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పిస్తుందని, దానిపైనా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సర్కారు వెల్లడించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తామని, కేంద్రం ఆమోదించి అనుమతిస్తే బీసీ రిజర్వేషన్లను పెంచి అమలు చేస్తామని, లేదంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర సర్కారు అనేక తీర్మానాలు చేసి పంపినా ఒక్కదానికీ జవాబివ్వని కేంద్రంపైకి నెపం నెట్టేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రిజర్వేషన్లపై మాటమార్చుతుందని ‘నమస్తే తెలంగాణ’ మొదటినుంచీ చెప్తున్నది. బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా ఇదే విషయాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతూనే ఉన్నది.

*_సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇలా_*

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామా షా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా కల్పిస్తున్నారు. బీసీలకు మాత్రం నామమాత్రంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్నాయి. గతం లో లాటరీ పద్ధతిలో, ర్యాండమ్‌గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయ పద్ధతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తుండగా ప్రతిసారీ వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఓబీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కే కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్‌రావు గవాళి కేసు లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ట్రిపుల్‌ టీ పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది. మొదటిది ప్రతి స్థానిక సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు, ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తిస్థాయి రాజ్యాంగబద్ధమైన, డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేయా లి. రెండోది జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లను స్థిరీకరించాలి. మూడోది రిజర్వేషన్లు కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి మొ త్తంగా 50 శాతం మేరకు మించకూడదు. వా టినే ట్రిపుల్‌ టీ అంటారు. ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చిచెప్పింది. ఆ నిబంధనలను పాటించని గుజరాత్‌, మహారాష్ట్రతోపాటు పలు రాష్ర్టాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. సిఫారసులు లేకుంటే బీసీ రిజర్వేషన్‌ స్థానాలన్నింటినీ జనరల్‌ స్థానాలుగానే మార్చాలని కూడా వెల్లడించింది.

*_మొదటినుంచీ కాంగ్రెస్‌ చిత్తశుద్ధి లేమి_*

సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీల కు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం అసాధ్యమని తెలిసిపోతున్నది. అయితే మార్గదర్శకాలను అనుసరించి ప్రామాణికమైన, శాస్త్రీయపద్ధతిలో బీసీ జనాభా లెక్కలను సేకరించి, కేంద్రానికి, సుప్రీంకోర్టుకు నివేదించి ఆ దిశగా కృషి చేయాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆ నిబంధనలను తుంగలో తొక్కింది. ఇష్టారీతిన, కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొపి హడావుడి నిర్ణయాలు తీసుకుంటూ నిబంధనలను రూపొందించి ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. జనగణన 1948 చట్టం ప్రకారం జనగణన, కులగణన చేపట్టే అధికారం కేవలం కేంద్రానికే ఉన్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండకపోవడమేగాక, అమలు చేసే అవకాశం కూడా లేదు. ఇటీవల బీహార్‌ సర్కారు నిర్వహించిన కులగణన కోర్టుకెక్కడమే నిదర్శనం. దీంతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ల అమలు మొదటికి వచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశించినా బీహార్‌ ప్రభుత్వం తన సర్వే నివేదికను వెల్లడించకపోవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోభాగంగా బీసీ కులగణన చేపడతామని, రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని రేవంత్‌రెడ్డి ఘంటాపథంగా ప్రకటించారు. ఎన్నికల అనంతరం కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు కులగణన అంటూ హడావుడి చేశారు. చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి చివరికి అసెంబ్లీలో తీర్మానం చేసి తన మోసపూరిత వైఖరిని కాంగ్రెస్‌ బయటపెట్టుకున్నది. ఆ తర్వాతనైనా కాంగ్రెస్‌ ప్రభు త్వం కేవలం కులగణనకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే అంటే ఒకరకరంగా జనగణన నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆ బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా బీసీ కమిషన్‌కు తొలుత అప్పగించింది. పలువురు బీసీ నేతలు దీనిపై హైకోర్టును ఆశ్రయించడం, కోర్డు ఆదేశాలతో అప్పటికప్పుడు ఎంక్వైరీస్‌ ఆఫ్‌ కమిషన్‌ యాక్టు కింద డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సర్వే మాత్రం ప్లానింగ్‌ విభాగం ద్వారా చేయించింది. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికపై తీర్మానం చేసి కేంద్రం ఒప్పుకొంటే అమలు చేస్తామని, లేదంటే పార్టీపరంగా కల్పిస్తామని మాట మార్చింది. దీనిపై బీసీ సంఘాలు, మేధావులు మండిపడుతున్నా రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ హామీని అమలు చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అదీ బీసీ ఉపకులాల వారీగా కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కారుకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. పార్టీ పరంగానే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌ పూనుకుంటే తీవ్రస్థాయిలో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

*_కేంద్రం ఇవ్వదని తెలిసీ.._*

అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కులగణన అంటూ హడావుడి చేసి రిజర్వేషన్ల పెంపు అంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసింది. కేంద్రం ఎట్లాగూ అంగీకరించదని తెలిసీ దానిపై నెపం మోపేందుకు సిద్ధమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక తీర్మానాలు చేసి పంపింది. కులగణన నిర్వహించాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తీర్మానించింది. ఎస్టీ రిజర్వేషన్లను కూడా పెంచుతూ తీర్మానించి పంపింది. అవేగాకుండా ఇతర అనేక అంశాలపై పదేళ్లలో లెక్కకు మించి తీర్మానాలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్కదానిపైనా రాష్ట్ర సర్కారుకు జవాబివ్వలేదు. తెలంగాణ పంపిన తీర్మానాలను ఆమోదించలేదు. అదీగాక రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్న బీజేపీ సర్కారు, దీనికి ఒప్పుకొనే అవకాశమేలేదు. ఇదే విషయాన్ని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. అయినా తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఆమోదిస్తే అమలు చేస్తాం, లేదంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్‌ ప్రకటించడంలోనే కుట్ర తేటతెల్లమైందని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ల హామీని తుంగలో తొక్కి ఆ నెపాన్ని కేంద్రంపై మోపేందుకే కొత్తనాటానికి తెరతీసిందని విమర్శిస్తున్నారు.

*_ముందే చెప్పినం,,_*

సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాలు ప్రధానంగా ఓటరు జాబి తా ఆధారంగా బీసీల రిజర్వేషన్లను స్థిరీకరించాయి. మహారాష్ట్ర సైతం అదేబాటలో కొనసాగుతున్నది. ఇక బీహార్‌, కర్ణాటక రాష్ర్టాలు మాత్రం సమగ్ర కులసర్వేలను నిర్వహించాయి. వాటి ఆధారంగా బీసీ రిజర్వేషన్లను స్థిరీకరించేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే ఒడిశా ప్రభు త్వం మాత్రం కమిషన్‌ ఏర్పాటు చేయకుండా, బీసీ రిజర్వేషన్లను మొత్తంగా రద్దు చేసి, వాటన్నింటినీ జనరల్‌ స్థానాలుగా మార్చింది. బీసీలకు పార్టీ పరంగా 50 శాతం టిక్కెట్లు కేటాయించింది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ సర్కార్‌ అదే ఎత్తుగడ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నదని ‘నమస్తే తెలంగాణ’ ముందునుంచే చెప్తూవస్తున్నది. ప్రామాణికమైన డాటా లేకుండా డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసులు చెల్లబోవని, ఈ నేపథ్యంలో ఒడిశా తరహాలోనే పార్టీ పరంగా టిక్కెట్లు కేటాయిం చి, తద్వారా 42 శాతం హామీని అమలు చేయాలని కాంగ్రెస్‌ చూస్తున్నదని ఆదినుంచీ చెప్తున్నది. అందుకు తగ్గినట్టుగానే కాంగ్రెస్‌ ప్రకటన చేయడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment