*భూభారతి, రేషన్ కార్డులు, ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్‌లు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ మను చౌదరి*
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 4
భూభారతి, రేషన్ కార్డులు, ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్‌లను త్వరితగతిన పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి తహసీల్దార్లను, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అవసరమైన చోట మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, డీఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతి, ఆర్డీఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాలు మరియు మున్సిపాలిటీల వారీగా భూభారతి, రేషన్ కార్డులు, ఎల్‌ఆర్‌ఎస్ పెండింగ్‌లకు గల కారణాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. భూభారతిలో తిరస్కరించిన దరఖాస్తులపై స్పష్టమైన నివేదికలు అందించాలని, భూ వివాదాలకు సంబంధించిన కోర్టు కేసులు, లిటిగేషన్‌లో ఉన్న ప్రభుత్వ భూముల ఫిజికల్ పొజిషన్ వివరాలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ భూములను కబ్జాలకు గురికాకుండా కాపాడాలని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు.
రేషన్ కార్డుల అంశంలో, ఎక్కువ పెండింగ్‌లపై కలెక్టర్ ఆరా తీసి, అర్హులైన వారికి త్వరితగతిన కార్డులు మంజూరు చేయాలని ఆదేశించారు. అలాగే ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి ప్రొసీడింగ్స్ అందించాలని, అవసరమైతే క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించాలని తెలిపారు. సమస్యాత్మక దరఖాస్తుల వివరాలను తక్షణం సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులలో కూడా చాలా పెండింగ్‌లు ఉన్నాయని పేర్కొంటూ, వాటినీ త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లను ఆదేశించారు. ప్రతి మండలానికి, మున్సిపాలిటీకి ప్రత్యేకంగా సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు కలెక్టర్ అందించారు.